క్లీన్ సిటీ జాబితాలో విశాఖ, తిరుపతి
దేశవ్యాప్తంగా స్వచ్ఛత పాటించిన పట్టణాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2017 ర్యాంకులను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు విడుదల చేశారు. ఈ జాబితాలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం తొలి ర్యాంక్ సాధించింది. గత రెండు సర్వేల్లో తొలి ర్యాంక్ సాధించిన మైసూర్ ఈసారి ఐదో ర్యాంక్‌కే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, తిరుపతి టాప్‌టెన్‌లో స్థానం సాధించాయి. మొత్తం 434 పట్టణాలకు ర్యాంకులు విడుదల చేశారు. ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు తొలి స్థానం, భోపాల్‌కు రెండో స్థానం, స్వచ్ఛ్ సర్వేక్షణ్ ర్యాంకుల్లో విశాఖకు మూడోస్థానం, సూరత్ 4, మైసూర్ 5, తిరుచిరాపల్లి 6, న్యూఢిల్లీ 7, నవీ ముంబాయి 8, తిరుపతి 9, వడోదరాకు పదోస్థానం దక్కింది. టాప్ -50లో గుజరాత్ నుంచి 12, మధ్యప్రదేశ్ నుంచి 11, ఆంధ్రప్రదేశ్ నుంచి 8 పట్టణాలు స్థానం సాధించాయి. ఈ మూడు రాష్ట్రాలు స్వచ్ఛభారత్‌లో గణనీయమైన ప్రగతి సాధించాయని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాంకులు పొందిన పట్టణాలకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. స్వచ్ఛభారత్ ఒక్కరోజు కార్యక్రమం కాదని, ఇది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ అన్నారు. మన శరీరంలాగే పరిసరాలనూ శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. స్వచ్ఛభారత్‌ను ప్రతి ఒక్కరూ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలన్నారు. 2019 నాటికి స్వచ్ఛభారత్ లక్ష్యం నెరవేరాలన్నది ప్రధాని కోరిక అని అన్నారు.








