కాకినాడ మేయర్గా సుంకర పావని
కాకినాడ నగర పాలక మేయర్ అభ్యర్థి ఎవరనే విషయంలో ఉత్కంఠకు తెరపడింది. మేయర్ అభ్యర్థిగా సుంకర పావనిని, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా కాలా సత్తిబాబును తెలుగదేశం పార్టీ ఖరారు చేసింది. అనంతరం నగర పాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. అనంతరం మేయర్ పీఠంపై సుంకర పావనీ ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లకు పలువురు శుభాకాంక్షల తెలిపారు.
మేయర్ అభ్యర్థి ఎంపిక కోసం తెలుగుదేశం పార్టీ తీవ్ర కసరత్తు చేసింది. అందరి అభిప్రాయాలు సేకరించిన అనంతరం మేయర్ అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని మంత్రులు, పార్టీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికే వదిలేశారు. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం మేయర్ అభ్యర్థిగా సుంకర పావని పేరును అధికారికంగా ప్రకటించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మంత్రి ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల ఎంపిక విషయంలో అందరి అభిప్రాయాలను తీసుకుని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి తెలిపారు.








