విదేశీ పర్యటనకు జేసీ దివాకర్‌రెడ్డి!
విశాఖ విమానాశ్రయ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి వివాదంలో చిక్కుకున్న తెదేపా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. పలు దేశీయ విమానయాన సంస్థలు ఆయనపై నిషేధం విధించిన ఒక్కరోజులోనే ఆయన విదేశాలకు వెళ్లిపోవడంపై ఆయన సోదరుడు, అనంతపురం ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి స్పందించారు. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా కుటుంబంతో కలిసి జేసీ విదేశీ పర్యటనకు వెళ్లారన్నారు. ఇదివరకే వెళ్లాలని నిర్ణయించుకున్న ప్రకారమే ఈ పర్యటనకు బయల్దేరి వెళ్లారని ప్రభాకర్‌రెడ్డి స్పష్టంచేశారు. కుటుంబంతో తానూ వెళ్లాల్సి ఉందని, అయితే, వ్యక్తిగత కారణాల రీత్యా వెళ్లలేకపోయానన్నారు. అయితే ఎక్కడికి వెళ్లారనే విషయాన్ని వెల్లడించేందుకు మాత్రం ప్రభాకర్‌రెడ్డి నిరాకరించారు.













