మహానాడుకు భారీ ఏర్పాట్లు
విశాఖలో జరగనున్న మహానాడుకు భారీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. స్థానిక ఎయు ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో జరుగుతున్న మహానాడు ఏర్పాట్లును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో జరిగిన మహానాడుల కన్నా ఇది భిన్నంగా ఉంటుందని చెప్పారు. చాలా కాలం తరువాత ఈ మహానాడు విశాఖలో జరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉత్తరాంధ్ర సమస్యలపై చర్చించాలని పార్టీ అధినేత చంద్రబాబును కోరుతున్నామని అన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన 19 తీర్మానాలు ప్రవేశపెడుతున్నామని తెలిపారు. మహానాడు మూడు రోజులు విశాఖ జిల్లా అంతటా పండుగ వాతావరణం నెలకొనేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. విశాఖ జిల్లా ముఖద్వారాల మొదలు హైవే అంతా భారీ ఎత్తున స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ సభలకు 35 వేల మంది హాజరవుతున్నట్టు తెలిపారు. వీరిలో ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా భోజన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. 28న ఏన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని మహానాడులో ప్రత్యేక వంటకాలు వండిస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్‌కు ఇష్టమైన అరిశెలు, బెల్లం, జున్ను, మాడుగుల హల్వాను ప్రత్యేకంగా వడ్డించనున్నామని ఆయన తెలియజేశారు.








