కాకినాడలో బీజేపీకి హ్యాండిచ్చిన టీడీపీ
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీల మధ్య అంతర్యుద్ధం మొదలైంది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ మిత్రపక్షాలుగా బరిలోకి దిగాయి. మొత్తం 48 డివిజన్లున్న కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 9 డివిజన్లను బీజేపీకి కేటాయించి, 39 స్థానాల్లో టీడీపీ బరిలోకి దిగింది. అయితే నామినేషన్ల ఉపసంహరణ తర్వాత బీజేపీకి కేటాయించిన సీట్లలో కూడా తెలుగుదేశం అభ్యర్థులు రెబెల్స్ గా బరిలో ఉండటంతో రెండు పార్టీల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో స్థానిక బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తెలుగుదేశం అధిష్ఠానం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఒప్పందం ప్రకారం బీజేపీకి కేటాయించిన 8, 35, 47 డివిజన్లలో నామినేషన్లు వేసిన టీడీపీ అభ్యర్థులు తమ నామినషన్లను ఉపసంహరించుకోక పోవడం ఇప్పుడు రెండు పార్టీలకూ తలనొప్పిగా మారింది.
మూడు డివిజన్లలో టీడీపీ రెబల్ అభ్యర్థులు……..
రెండు పార్టీల మధ్య చర్చలు జరిగినప్పుడు ఏ పార్టీలోనూ రెబెల్స్ ఉండకూదన్న ఒప్పందం జరిగింది. ఇప్పటికే నామినేషన్లు వేసిన వారి నుంచి ఉపసంహరించుకున్నట్లు సంతకాలు చేయించుకుని పత్రాలు దగ్గర పెట్టుకోవాలని కూడా రెండు పార్టీలూ నిర్ణయించాయి. అయితే ఈ మూడు డివిజన్ల అభ్యర్థుల దగ్గర నుంచి టీడీపీ అధిష్టానం సంతకాలు తీసుకోలేదు. దీంతో వారు రెబెల్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. దీనిపై బీజేపీ అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. సీట్లు తక్కువివ్వడమే కాకుండా, ఉన్న సీట్లలో కూడా పోటీకి దిగడమేంటని ప్రశ్నిస్తుంది బీజేపీ. కాకినాడ 9వ డివిజన్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య పోటీ చేశారు. ఆయన డివిజన్లో కూడా టీడీపీ అభ్యర్థి రంగంలో ఉండటంంతో ఇక తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకుంది. అభ్యర్థులను బరిలో నుంచి తప్పించకుంటే తాము కూడా ఇతర డివిజన్లో సహాయ నిరాకరణ చేస్తామని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల గొడవ తారా స్థాయికి చేరిందనే చెప్పొచ్చు.








