ఆగస్టు 7న శ్రీశైలం ఆలయం మూసివేత
చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఈ నెల 7వ తేదీన కర్నూలు జిల్లా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల ఉభయ దేవాలయాల ద్వారాలను మూసివేయనున్నట్లు దేవస్థానం ఈవో భరత్‌గుప్తా తెలిపారు. ఆ రోజు తెల్లవారు జామున 2:30 గంటలకు సుప్రభాతసేవ, మంగళహారతి నిర్వహించి అనంతరం 4:30 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభమవుతుందన్నారు. ఉదయం 5:30 గంటలు, 9:30 గంటల సమయంలో అభిషేకాలు, కుంకుమార్చనలు జరుగుతాయన్నారు. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి గ్రహణ కాలం మొదలు కావడంతో ఉభయదేవాలయాల ద్వారాలు మూసివేయనున్నట్లు తెలిపారు. తిరిగి మరుసటి రోజు 8వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ జరపనున్నట్లు తెలిపారు.








