తిరుమలలో వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేకంగా టోకెన్ కౌంటర్లు
తిరుమలలో వృద్ధులు, వికలాంగులకు మరింత సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఎస్వీ మ్యూజియం ఎదురుగా ప్రత్యేకంగా టోకెన్ కౌంటర్లను బుధవారం టిటిడి ప్రారంభించింది. టిటిడి తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు ఈ కౌంటర్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెఇఓ మాట్లాడుతూ రోజుకు రెండు స్లాట్లలో దాదాపు 1500 మంది వృద్ధులు, వికలాంగులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోందని ఫిర్యాదులు అందుతున్నాయని, వీటిని నివారించి మరింత మెరుగైన దర్శనం కల్పించేందుకు టోకెన్ కౌంటర్లు ప్రారంభించామని తెలిపారు. మధ్యాహ్నం స్లాట్‌కు కూడా ఉదయమే టోకెన్లు మంజూరు చేస్తామని, దీనివల్ల ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉండదని వివరించారు. దక్షిణ మాడ వీధిలో గల వృద్ధులు, వికలాంగులు వేచి ఉండే హాలులో ఇటీవల పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. టిటిడి ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు అక్కడ సీట్ల సామర్థ్యాన్ని పెంచామని జెఇఓ తెలిపారు.








