త్వరలో మోరిలో స్మార్టు విలేజి యూనివర్శిటీ
తూర్పుగోదావరి జిల్లా మోరి ఆకర్షణీయ గ్రామం సమీప భవిష్యత్తులో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు నమూనాగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. రాష్ట్రంలో వేలాది పల్లెలకు మార్గదర్శనం చేసే స్మార్టు విలేజి యూనివర్శిటీగా తీర్చిదిద్దాలన్నారు.సోమవారం అమరావతి సచివాలయంలోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రి మోరి స్మార్టు విలేజి ప్రాజెక్టు మీద సమీక్ష నిర్వహించారు. మోరి స్మార్టువిలేజి ప్రాజెక్టు-2 ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా బర్కిలీ విశ్వవిద్యాలయ పరిశోధకుడు, ప్రొఫెసర్ సాల్మన్ డార్విన్ బృందంతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఆకర్షణీయ గ్రామం అంటే కేవలం అత్యుత్తమ సదుపాయాలతో విలసిల్లేదే కాదని, అది గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పరిపుష్టం చేసేదిగా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. ముందుగా ఎంపిక చేసిన ఆయా గ్రామాల్లో లభ్యమయ్యే స్థానిక ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయం ద్వారా ప్రాచుర్యం కల్పించేందుకు గతంలో 45 బహుళ జాతికంపెనీలు, 25 అంకుర సంస్థలు ఆసక్తి ప్రదర్శించాయని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించి ముందుగా ఎంపిక చేసిన 465 గ్రామాలలో స్థానిక ఉత్పత్తులను సేకరించి విక్రయించే ప్రాజెక్టును తయారు చేయాలని ఆయన కోరారు. ప్రొ. సాల్మన్ డార్విన్ బృందం ఇందుకు చొరవ తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. అమెరికాలోని బర్కిలీ విశ్వవిద్యాలయంలో పరిశోధకుడు, మోరికి చెందిన ప్రొఫెసర్ సోల్మన్ డార్విన్ తన గ్రామాన్ని స్మార్టు విలేజిగా తీర్చిదిద్దటానికి గతంలో ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ‘హాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ విభాగంలో బర్కిలీ గార్వుడ్ సెంటర్ ఫర్ కార్పొరేట్ ఇన్నోవేషన్ స్మార్టు విలేజి ప్రాజెక్టుకు సహకారం అందజేసింది.








