ఆగస్టు 15న స్పోర్ట్స్ అకాడెమీలు ప్రారంభం : చంద్రబాబు
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికోసం ఏర్పాటు చేస్తున్న 6 స్పోర్ట్స్ అకాడమీలను ఆగస్ట్ 15న ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అలాగే నిర్మాణంలో ఉన్న నాలుగు వాటర్ స్పోర్ట్స్ అకాడమీలనూ కూడా అదేరోజు ప్రారంభించాలని సూచించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో రాష్ట్రంలోని క్రీడల అభివృద్ధిపై, నైపుణ్య శిక్షణాభివృద్ధి కార్పొరేషన్‌పై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహిచారు. విశాఖ, కాకినాడ, గుడివాడ, నరసరావుపేట, నెల్లూరు, అనంతపురంలో స్పోర్ట్స్ అకాడమీలు ఏర్పాటు ఎంతవరకు వచ్చిందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ అకాడమీలో షూటింగ్, అథ్లైటిక్స్, స్విమ్మింగ్, బాడ్మింటన్, జూడో, తైక్వాండో, వెయిల్ లిప్టింగ్ తదితర క్రీడలకు శిక్షణ ఇవ్వనున్నారు. వీటి నిర్వహణకు ఏడాదికి రూ.20 కోట్లు వ్యయం కానుంది. ఒక్కో అకాడమీలో కనీసం 80మంది క్రీడాకారులకు శిక్షణ ఇస్తారు. విజయవాడ, నాగాయలంక, జంగారెడ్డిగూడెం, తాడిపూడిలో వాటర్ స్పోర్ట్స్ అకాడమీల పనులు శరవేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సృష్టం చేశారు. రాష్ట్రంలోని 16వేల గ్రామాల్లోనూ తప్పని సరిగా ఆట స్థలాలను ఏర్పాటు చేయాలని నిర్ధేశించారు. 175 నియోజకవర్గాల్లో స్టేడియాల నిర్మాణం వచ్చే ఏడాదికి పూర్తి కావాలని గడువు విధించారు. మండల కేంద్రాల్లోనూ క్రీడా మైదానాల నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు.








