TTD Ghee: కల్తీ పాపం ఎవరిది? పెద్దలను వదిలేసి.. పిలకలకే ఉరి వేస్తున్నారా?
తిరుమల ఏడుకొండల వేంకటేశ్వరుని కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన కల్తీ నెయ్యి కుంభకోణంలో అసలు నిందితులు ఎవరు? నిబంధనలను తుంగలో తొక్కి, కల్తీకి రాచమార్గం వేసిన రాజకీయ పెద్దలను వదిలేసి, కేవలం అధికారులను, కింది స్థాయి సిబ్బందిని బలిపశువులను చేస్తున్నారా? సిట్ (SIT) దాఖలు చేసిన నివేదికలు, సిఫార్సుల తీరు చూస్తుంటే.. వైసీపీ ముఖ్య నేతలను కాపాడేందుకు ఒక భారీ సేఫ్ ఎగ్జిట్ ప్లాన్ జరుగుతోందా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
శ్రీవారి లడ్డూ తయారీకి వాడే నెయ్యి విషయంలో గత తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత కఠినమైన నిబంధనలను అమలు చేసింది. అయితే, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, టీటీడీ పాలక మండలి వ్యూహాత్మకంగా ఆ నిబంధనలను సడలించింది. ఆంధ్రప్రదేశ్ దేవదాయ చట్టం-1987 (సెక్షన్ 97బి) ప్రకారం టీటీడీలో బోర్డు చైర్మనే సుప్రీం. నెయ్యి నాణ్యతా ప్రమాణాలను తగ్గించి, తక్కువ ధరకే టెండర్లు కట్టబెట్టేలా చేసిన తీర్మానాలపై అప్పటి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతకాలు స్పష్టంగా ఉన్నాయి. కల్తీ జరగడానికి నిబంధనల సడలింపే ప్రధాన కారణమని సిట్ స్వయంగా అంగీకరించింది. మరి ఆ సడలింపులకు కారకుడైన బోర్డు చైర్మన్‌ను నిందితుడిగా ఎందుకు చేర్చలేదు?
ఈ కేసులో అప్పటి టీటీడీ చైర్మన్ పీఏ చిన్నప్పన్న పాత్ర కీలకంగా మారింది. ఒక సాధారణ కాంట్రాక్ట్ ఉద్యోగి అయిన చిన్నప్పన్న, ఏకంగా ఢిల్లీకి వెళ్లి డెయిరీ ప్రతినిధులతో కమీషన్ల కోసం బేరసారాలు ఆడారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక సాధారణ పీఏకు అంతటి ధైర్యం ఎక్కడిది? అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. రాజకీయ అండదండలు లేకుండా వందల కోట్ల టర్నోవర్ చేసే కంపెనీలను ఒక ఉద్యోగి బెదిరించగలడా? చిన్నప్పన్న ఖాతాల్లోకి కోట్లు చేరాయని చెబుతున్న దర్యాప్తు సంస్థలు, ఆ నిధులు అక్కడితో ఆగిపోయాయా లేక పైస్థాయికి చేరాయా అనే విషయాన్ని ఎందుకు వెలికితీయడం లేదు?
సిట్ తన నివేదికలో ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్, ధర్మారెడ్డి వంటి అధికారులపై చర్యలకు సిఫారసు చేసింది. దీనిపై పరిపాలనా పరంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చట్ట ప్రకారం అధికారులు బోర్డు నిర్ణయాలను అమలు చేసేవారు మాత్రమే. విధాన నిర్ణయం తీసుకున్న చైర్మన్‌ను వదిలేసి, అమలు చేసిన అధికారులను బాధ్యులను చేయడం అంటే.. అసలు నేరస్థుడిని కాపాడి, సాక్షులను లేదా సహకరించిన వారిని శిక్షించడమే అవుతుంది.
మద్యం పాలసీ మార్చడమే నేరమని ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసినప్పుడు, అదే తరహాలో నెయ్యి టెండర్ల పాలసీని మార్చిన వైవీ సుబ్బారెడ్డిని ఎందుకు ప్రశ్నించడం లేదు? దర్యాప్తు సంస్థలపై ఉన్న రాజకీయ ఒత్తిళ్లు లేదా కేంద్ర-రాష్ట్ర స్థాయిలోని అదృశ్య ఒప్పందాలు ఏవైనా వైసీపీ పెద్దలను కాపాడుతున్నాయా? సిట్ చార్జిషీట్లో అధికారుల పేర్లు ఉంచి, చైర్మన్ పేరును పక్కన పెట్టడం వెనుక ఉన్న మతలబు ఏమిటి? కూటమి ప్రభుత్వం కూడా అధికారులపై వేటు వేస్తూ సరిపెట్టుకుంటోందే తప్ప, అసలు సూత్రధారులైన రాజకీయ నేతలను బోనులో నిలబెట్టడంలో ఎందుకు వెనుకడుగు వేస్తోంది?
శ్రీవారి ప్రసాదం విషయంలో జరిగిన అపరాధం కేవలం నిధుల దుర్వినియోగం మాత్రమే కాదు, కోట్లాది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం. చిన్న చేపలను, కింది స్థాయి అధికారులను బలిపశువులను చేసి, పెద్ద తలకాయలను తప్పించడం వల్ల న్యాయం జరగదు. నిబంధనలను మార్చిన సంతకం ఎవరిదో, ఆ సంతకం వెనుక ఉన్న లబ్ధిదారులు ఎవరో తేల్చినప్పుడే శ్రీవారికి నిజమైన సేవ చేసినట్లవుతుంది.






