ఆర్ఎస్ బ్రదర్స్ రూ.1.50 కోట్ల విరాళం
తిరుమల శ్రీవారికి హైదరాబాద్కు చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ రిటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.1.50 కోట్ల విరాళం అందజేసింది. విరాళానికి సంబంధించిన డీడీలను కంపెనీ చైర్మన్ పి.వేంకటేశ్వర్లు, మేనేజింగ్ డైరెక్టర్లు సత్యనారాయణ, ప్రసాదరావు సంయుక్తంగా తిరుమల జేఈవో శ్రీనివాసరాజును కలిసి అందజేశారు. విరాళం మొత్తంలో వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.కోటి, అన్నప్రసాదం, విద్యాదానం, గోసంరక్షణ ట్రస్టులకు రూ.పది లక్షల వంతున, ప్రాణదానం ట్రస్టుకు రూ.20 లక్షలు డిపాజిట్ చేయాలని జేఈవోకు సూచించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ ఈ కంపెనీ ఏటా రూ.కోటిన్నర వరకు శ్రీవారికి విరాళాలు అందిస్తున్నట్లు తెలిపారు. దాతలను జేఈవో సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.








