అంతర్జాతీయ మార్కెట్ కోసం అరకు కాఫీని సేకరించండి : మంత్రి నారా లోకేష్
ఎస్ఎల్ఎన్ కాఫీ చైర్మన్ శతప్పన్ తో భేటీలో మంత్రి నారా లోకేష్ ప్రతిపాదన
విశాఖపట్నం: ఎల్ఎల్ ఎన్ కాఫీ చైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ ఎన్.శతప్పన్ తో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… మిడిల్ ఈస్ట్, యూరప్, ఆగ్నేయాసియా, రష్యాతో సహా కీలక అంతర్జాతీయ మార్కెట్లకు ప్రీమియం అరకు కాఫీని సేకరించాల్సిందిగా కోరారు. అరకు కాఫీ ప్రాసెసింగ్, మార్కెటింగ్, పంపిణీ కోసం ఆంధ్రప్రదేశ్ గిరిజన కార్పొరేషన్ తో కలిసి పనిచేయాలని కోరారు. హైవే వెంట ఉన్న వేసైడ్ సౌకర్యాలు, ప్రధాన పట్టణ కేంద్రాల్లో ఎస్ఎల్ఎన్ కాఫీ అనుబంధ సంస్థ లెవిస్టా కేఫ్లను ఏర్పాటు చేయాలన్నారు. విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, తిరుపతి పరిసరాలు ఇందుకు అనువుగా ఉంటాయని చెప్పారు.
ఎస్ఎల్ ఎన్ కాఫీ చైర్మన్ శతప్పన్ మాట్లాడుతూ… ఎస్ఎల్ఎన్ కాఫీ ప్రైవేట్ లిమిటెడ్ కాఫీ కోసం తన సొంత ఇంటిగ్రేటెడ్ తయారీ, ప్రాసెసింగ్, క్యూరింగ్ యూనిట్లను నిర్వహిస్తోంది. తమ సంస్థ సంవత్సరానికి 30వేల నుంచి 50వేల మెట్రిక్ టన్నుల (ఎంటీ) వరకు క్యూరింగ్, గ్రీన్ బీన్ ట్రేడింగ్ సామర్థ్యం కలిగి ఉందని చెప్పారు. ఎస్ఎల్ఎన్ కాఫీ మొత్తం ఆదాయంలో 80% పైగా మిడిల్ ఈస్ట్, యూరప్, ఆగ్నేయాసియా, రష్యా, సీఐఎస్ ప్రాంతాల నుంచి వస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని శతప్పన్ అన్నారు.







