రౌండ్-ది-క్లాక్ విండ్-సోలార్-బీఈఎస్ఎస్ ప్రాజెక్టును ఏర్పాటు చేయండి : మంత్రి లోకేష్
రిసాల్వెన్ సంస్థ సీఈవో పరాగ్ శర్మతో మంత్రి నారా లోకేష్ సమావేశం
విశాఖపట్నం: రిసాల్వెన్ సంస్థ సీఈవో పరాగ్ శర్మతో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ ప్రాంగణంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… 2025 పార్టనర్ షిప్ సమ్మిట్ లో 1 గిగా వాట్ ఎంవోయూ నుంచి 180 మెగావాట్ల విండ్ ప్రాజెక్టు, నేటి ఎంవోయూ వరకు ఏపీలో రిసాల్వెన్ స్థిరంగా ఎదుగుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. సకాలంలో ప్రాజెక్టు అమలుకు పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమ పునరుత్పాదక ఇంధన జోన్ (అనంతపురం, కర్నూలు, కడప) లో రౌండ్-ది-క్లాక్ విండ్-సోలార్-బీఈఎస్ఎస్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాల్సిందిగా రిసాల్వెన్ సంస్థను కోరారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు 12.62 జీడబ్ల్యూహెచ్ బ్యాటరీ స్టోరేజ్ ను ఆమోదించింది, దాని 25 జీడబ్ల్యూహెచ్ లక్ష్యంలో సగం ఇంకా అందుబాటులో ఉందని చెప్పారు. రిసాల్వెన్ సీఈవో పరాగ్ శర్మ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే తమ సంస్థ మూడు ప్రాజెక్టులను నిర్వహిస్తోందని తెలిపారు.
2025 పార్టనర్షిప్ సమ్మిట్ సందర్భంగా కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో 1 గిగా వాట్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధి కోసం రిసాల్వెన్ ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుందని అన్నారు. జెలెస్ట్రా ఎస్పీవీ అయిన గనేకో త్రీ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కు 180 మెగావాట్ల విండ్, 120 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టుతో కూడిన 300 మెగావాట్ల విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టును ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. మెసర్స్ రిసాల్వెన్ టూ ఎనర్జీ అనే వారి ఎస్పీవీకి 75 మెగావాట్ల విండ్, 75 మెగావాట్ల సోలార్ సామర్థ్యాలతో కూడిన 100 మెగావాట్ల విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టును (రూ.980 కోట్లు) ప్రభుత్వం మంజూరు చేసింది, ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రారంభించాల్సి ఉందన్నారు. రిసాల్వెన్ సంస్థ ఆంధ్రాలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్టు చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు.







