జనసేన పార్టీతో ఎలాగైనా పొత్తుపెట్టుకుంటే తప్ప అధికారం రాదు : ప్రశాంత్ కిశోర్
2019 ఎన్నికలలో కూడా ఆ కోరిక తీరకపోతే ఇక ఎప్పటికీ తన కోరిక తీరదన్న అభిప్రాయానికి వచ్చిన జగన్మోహన్రెడ్డి.. తన అభిమతానికి, అభిజాత్యానికి విరుద్ధంగా అనేక మెట్లు దిగారు. పీకే అని పిలిచే ప్రశాంత్ కిశోర్‌ను వ్యూహకర్తగా నియమించుకోవడం కూడా ఇందులో భాగమే! మామూలుగా అయితే వ్యూహకర్తలు తెర వెనుకే ఉంటారు. అయితే జగన్ అందుకు భిన్నంగా ప్రశాంత్ కిశోర్‌ను బహిరంగంగా తెర మీదకు తెచ్చారు. ప్లీనరీ వేదికగా ఆయనను ఆహ్వానించి కార్యకర్తలకు పరిచయం చేయడమే కాకుండా వేదికపై ఆయనకు సముచిత స్థానం కల్పించారు.
ప్రశాంత్ కిశోర్ వల్లే వచ్చే ఎన్నికలలో తమకు అధికారం దక్కబోతున్నదన్న అభిప్రాయాన్ని కలిగించారు. ప్రజాదరణ ఉన్న ఏ నాయకుడు కూడా ఇలా చేయరు. ఎందుకంటే వ్యూహకర్తల వల్లే అధికారం వచ్చే పక్షంలో నాయకుడి గొప్పదనం ఏమి ఉందని కార్యకర్తలు అభిప్రాయపడే ప్రమాదం ఉంది. అయితే ముఖ్యమంత్రి కావాలని జగన్మోహన్రెడ్డి ఎంతగా కోరుకుంటున్నారో ఆయనను అభిమానిస్తున్నవారు కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలని అంతే బలంగా వాంఛిస్తున్నారు. అలాంటి వారికి ధైర్యం చెప్పడం కోసమే ప్రశాంత్ కిశోర్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చి ఉంటారు. ‘మనతో ప్రశాంత్ కిశోర్ ఉన్నారు. ఇక మనం అధికారంలోకి రావడం ఖాయం. నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేసింది కూడా పీకేనే. నన్ను కూడా ముఖ్యమంత్రిని చేస్తాడు’ అని అభిమానులకు సందేశం ఇవ్వడం కోసం జగన్మోహన్రెడ్డి ఈ పని చేసి ఉంటారు. పనిలో పనిగా ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహా మేరకు తాను సుదీర్ఘ పాదయాత్ర చేపట్టబోతున్నట్టు జగన్ ప్రకటించారు. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే చేపడుతున్న ఈ పాదయాత్రతో జగన్‌కు కాళ్లు వాస్తాయా? లేక అధికార పీఠం వరకు తీసుకెళుతుందా అనేది వేచి చూద్దాం. ముఖ్యమంత్రి కావాలన్న కోరిక నెరవేరాలంటే పాదయాత్ర చాలదు– ఇంకా చాలాచేయాలని ప్రశాంత్ కిశోర్ చెప్పారట!
ప్రతిపక్షాలన్నీ కలిసి మహా కూటమిగా పోటీ చేయడం ఇందులో ఒకటి! మహా కూటమి ఏర్పడకపోయినా పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీతో ఎలాగైనా పొత్తుపెట్టుకుంటే తప్ప అధికారం దక్కదని కూడా ప్రశాంత్ కిశోర్ స్పష్టంచేశారట! ఈ పీకే ఒక్కడే చాలడు. ఆ పీకే (పవన్ కల్యాణ్) కూడా జత కలిస్తేనే ముఖ్యమంత్రికావాలన్న నీ కల నెరవేరుతుందని ప్రశాంత్ కిశోర్ సెలవిచ్చారట! ఉత్తర దక్షిణ ధృవాలైన జగన్మోహన్రెడ్డి– పవన్ కల్యాణ్ జత కడతారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న! అయితే పీకే ఇచ్చిన సలహా ఒకటైతే వైసీపీ నాయకులు మరోలా ఆలోచిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ పొత్తు చెడిపోతే బీజేపీతో జత కట్టాలని ఆ పార్టీకి చెందిన కొందరు ఉత్సాహపడుతున్నారు. వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ రెండో రోజుల క్రితం నంద్యాలలో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీతో బీజేపీకి సంబంధాలు తెగిపోతే అప్పుడు బీజేపీతో పొత్తుపెట్టుకునే విషయం తాము కచ్చితంగా పరిశీలిస్తామనీ, సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదనీ స్పష్టంచేశారు.








