TDP: పోలీసులకు పవర్.. కేడర్ కు వార్నింగ్.. ఇదీ చంద్రబాబు మార్క్..!!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్దిరోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా అధికార టీడీపీ తన రాజకీయ వ్యూహాల్లో ప్రదర్శిస్తున్న పరిణతి, సొంత పార్టీ నేతలపైనే చట్టపరమైన చర్యలకు వెనుకాడకపోవడం ఒక కీలక మలుపుగా కనిపిస్తోంది.
ఇటీవల వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రంలో ఉద్రిక్తతలకు దారితీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లను లక్ష్యంగా చేసుకుని వారు చేసిన వ్యక్తిగత విమర్శలు టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు ఆ ఇద్దరు నేతల ఇళ్ల ముట్టడికి ప్రయత్నించడం, దాడులకు దిగడం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.
సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా తమ కార్యకర్తలు ప్రత్యర్థి పార్టీ నేతలపై దాడి చేస్తే, వారిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ, ఈసారి టీడీపీ అధినాయకత్వం భిన్నమైన వైఖరిని అవలంబించింది. దాడులు జరిగిన వెంటనే స్పందించిన చంద్రబాబు, పార్టీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాసరావులతో అత్యవసరంగా చర్చించారు.
“రాజకీయాల్లో మాటలకు మాటలతోనే సమాధానం చెప్పాలి తప్ప, భౌతిక దాడులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం. వైసీపీ పన్నిన ట్రాప్‌లో పడి పార్టీ ప్రతిష్టను దెబ్బతీయవద్దు.” అని టీడీపీ కార్యకర్తలకు అధిష్టానం స్పష్టమైన సందేశం పంపించింది.
ఈ వ్యవహారంలో అత్యంత ఆశ్చర్యకరమైన, సాహసోపేతమైన నిర్ణయం ఏమిటంటే.. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించడం. అంబటి రాంబాబు ఇంటిపై దాడికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి దంపతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిని ఏ1, ఏ2గా చేర్చడం ద్వారా ప్రభుత్వం ఒక బలమైన సంకేతాన్ని పంపింది. తప్పు చేసిన వారు ఎవరైనా సరే, వారు అధికార పార్టీ వారైనా చట్టం వదిలిపెట్టదని తెలియజేసింది.ప్రభుత్వ బాధ్యత శాంతిభద్రతలను కాపాడటమే కానీ, పార్టీ ప్రయోజనాలను చూడటం కాదని తేల్చేసింది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై లేదా చంద్రబాబు నివాసంపై దాడులు జరిగినప్పుడు, బాధితులైన టీడీపీ నేతలపైనే రివర్స్ కేసులు పెట్టిన సందర్భాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అప్పుడు అధికార బలంతో ప్రతిపక్షాన్ని అణిచివేసే ధోరణి కనిపించింది.
అయితే, ప్రస్తుత పరిణామాలు టీడీపీకి, వైసీపీకి ఉన్న మౌలిక వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తున్నాయి. తప్పు జరిగినప్పుడు దాన్ని సమర్థించుకోకుండా, వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టడం చంద్రబాబు మార్క్ పాలిటిక్స్‌గా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది పార్టీ క్యాడర్లో కొంత అసంతృప్తిని కలిగించినప్పటికీ, తటస్థ ఓటర్లలో, సామాన్య ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచుతుంది.
ఈ చర్యల వల్ల టీడీపీ ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించిందనే గుర్తింపు తెచ్చుకుంటుంది. చట్టాన్ని గౌరవించే పార్టీగా జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. వైసీపీ హయాంలో జరిగినట్లే ఇప్పుడు జరుగుతోందనే విమర్శలను ఈ చర్యతో తిప్పికొట్టినట్లయింది. పోలీసులకు రాజకీయ ఒత్తిళ్లు లేకుండా పని చేసే వీలుందని ఈ ఘటన నిరూపించింది.
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ, అవి భౌతిక దాడుల వరకు వెళ్లినప్పుడు వ్యవస్థ కుప్పకూలుతుంది. టీడీపీ అధినాయకత్వం సకాలంలో స్పందించి, సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే కేసులు పెట్టే స్థాయికి వెళ్లడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. ఇది కేవలం ఒక దిద్దుబాటు చర్య మాత్రమే కాదు, భవిష్యత్తులో కార్యకర్తలు సంయమనం పాటించాలని హెచ్చరించే ఒక గుణపాఠం కూడా.






