కాంగ్రెస్ ఏపీలో పూర్తిగా పతనమైనట్లేనా?
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఇక పుంజుకోవడం కష్టంగానే కన్పిస్తోంది. నంద్యాల ఉప ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది. నంద్యాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఆటలో అరటిపండులా తయారైంది. టీడీపీ, వైసీపీల మధ్య జరిగిన పోరులో కాంగ్రెస్ కు నంద్యాలలో తీవ్ర భంగపాటు ఎదురైంది. 2014 ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి మరింత క్షీణించింది. నంద్యాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ ఖాదర్ కు కేవలం 1382 ఓట్లు మాత్రమే దక్కాయి. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఏపీలో రోజురోజుకూ తీసికట్టులా తయారైంది. పార్టీ నేతలతో పాటు క్యాడర్ కూడా ఆ పార్టీకి కరువైంది. చివరకు అభ్యర్థి దొరకడమూ కష్టమేననిపించే స్థాయిలో ఆ పార్టీ ఉంది. నంద్యాల ఉప ఎన్నిక కోసం అభ్యర్థి అబ్దుల్ ఖాదర్ ను హైదరాబాద్ నుంచి తీసుకురావాల్సి వచ్చింది. ఆయన హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న అబ్దుల్ ఖాదర్ ను బరిలోకి దింపింది.
ముస్లిం ఓట్లు కూడా……..
ముస్లిం ఓటు బ్యాంకు ఉన్న నంద్యాలలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారినే ఎంపిక చేసి కొంత పోటీని ఇవ్వాలని కాంగ్రెస్ భావించింది. కనీసం ఐదు వేలకు పైగా ఓట్లు సాధించి తన ఉనికిని కాపాడుకోవాలని ప్రయత్నించింది. పీసీసీ చీఫ్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డితో పాటు తులసీరెడ్డి లాంటి కొందరు నేతలే ప్రచార బాధ్యతలను భుజానకెత్తుకున్నారు. జాతీయస్థాయి నేతలు కాని, మాజీ కేంద్రమంత్రులుగా గతంలో పనిచేసిన వారెవ్వరూ నంద్యాల గడప కూడా తొక్కలేదు. ప్రత్యేకహోదా నినాదాన్ని విస్తృతంగా చేపట్టినా, కోటి సంతకాల సేకరణ జరిపినా కాంగ్రెస్ కు అనుకున్న స్థాయిలో ఓట్లు రాకపోవడంతో ఆ పార్టీ నేతలు మదనపడుతున్నారు. రాష్ట్ర విభజనను ఏపీ ప్రజలు ఇంకా మర్చిపోలేదన్న విషయం నంద్యాల ఉప ఎన్నిక కాంగ్రెస్ కు మరోసారి గుర్తు చేసింది.








