బాబుతో భేటీ పవన్ కు లాభమా? నష్టమా?
‘ఆయన ప్రశ్నించాలనుకుంటున్నాడా? పరిపాలించాలనుకుంటున్నాడా? ‘ ముందుగా ఈ విషయంలో ఒక స్పష్టత రానీయండి. ఆ తర్వాత జనసేన ఎలా ప్రజల్లోకి వెళుతుందో చూద్దాం అన్నాడొక సీనియర్ రాజకీయ వేత్త . పవన్ కల్యాణ్ రాజకీయ రంగప్రవేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఒక ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా చూడాలని కోరుకున్నారు. అందులోనూ లక్షలాదిగా ఉన్న ఆయన అభిమానులు, యువతలో ఈ భావన మరింతబలంగా ఉన్నమాట వాస్తవం. అయితే తాను ముక్కుసూటి రాజకీయాలు చేస్తానని చెబుతున్న పవన్ ఇప్పటికీ కొంత గందరగోళంగానే ఉన్నట్లు పరిశీలకుల అంచనా. పునర్విభజిత ఆంధ్రప్రదేశ్ లో 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పనిచేయలేక పోతోంది. ప్రజల అంచనాలను అందుకోలేకపోతోంది. మరోవైపు నిత్యం కేసులతో సతమతమవుతున్న జగన్ మోహన్ రెడ్డి వై.ఎస్.ఆర్. కాంగ్రెసు పార్టీ ప్రతిపక్షంగా బలమైన దాడి చేయలేకపోతోంది. ఈ రెండు పక్షాలను ఇరుకున పెట్టే అజెండాతో ముందుకు వెళ్లే రాజకీయపరమైన ముడిసరుకు ప్రత్యామ్నాయానికి సిద్దంగా ఉంది.
ఇమేజ్ ఆయన సొంతం……
వ్యక్తిగతంగా పవన్ కల్యాణ్ మాటకు కట్టుబడి ఉంటాడని, ఏదో చేయాలనే తపన ఉందని తెలిసిన వారు చెబుతుంటారు. దానిని ప్రజలు కూడా నమ్ముతుంటారు. పైపెచ్చు రాష్ట్రంలో 20 శాతం మేరకు ఉన్న కాపు జనాభా ఆయనకు పెట్టని అండ. యువతలో తిరుగులేని క్రేజ్ ఆయన సొంతం. అధికారం సంగతి పక్కనపెట్టినా రాష్ట్రంలో రాజకీయ చక్రం తిప్పడానికి ఇంతకుమించిన ఆయుధాలేం కావాలి? కానీ వాటిని సకాలంలో, సమర్థంగా వినియోగించుకోవడంలో, అందిపుచ్చుకోవడంలో జనసేనాని విఫలమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో వై.సి.పి.ని మట్టికరిపించి తెలుగుదేశం పార్టీ పవర్ లోకి రావడంలో పవన్ నిర్వహించిన పాత్ర అపూర్వం. ఎందుకంటే సానుభూతి పవనాలతో ఊపు మీద ఉన్న వై.సి.పికి తన ఇమేజ్ చట్రంతో అడ్డుకట్ట వేసి టీడీపీ వైపు ప్రజలను మొగ్గు చూపేలా చేయగలిగారు పవన్. సొంతంగా జనసేన పార్టీ పెట్టుకున్నప్పటికీ కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీకి మద్దతు ఇవ్వడం మంచి పరిణామంగా ప్రజలు భావించారు. పవన్ వల్ల ఎన్ని లక్షల ఓట్లు టీడీపీ ఖాతాలో జమ అయ్యాయి? ఎన్ని నియోజకవర్గాల్లో ఫలితం తారుమారయ్యింది? అన్న గణాంకాల జోలికి పోకుండా ఆలోచిస్తే ఒక వేవ్ క్రియేట్ కావడానికి, తటపటాయిస్తున్న తటస్థ ఓటర్లు తెలుగుదేశానికి సానుకూలంగా మారడానికి జనసేనాని కచ్చితంగా ఉపయోగపడ్డారు. ఇది గతం.
ప్రజారాజ్యం పొరపాట్లు పునరావృతమవుతాయా?
2019 ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని సత్తా చూపుతుందని ఆయన స్వయంగా ప్రకటించారు. పార్టీ నిర్మాణంపైనా, ప్రజామద్దతుపైనా దృష్టి సారించాల్సిన సమయం. మరో 20 నెలల కాలంలో ఎన్నికలు రాబోతున్నాయి. ఎనిమిది నెలల కాలంలోనే అధికారంలోకి వస్తామని కలలు కన్న ప్రజారాజ్యం చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇప్పట్నుంచీ పార్టీ నిర్మాణానికి పూనుకోవాలి . క్షేత్రస్థాయిలో క్యాడర్ ను పటిష్ఠం చేసుకోవాలి. రాజకీయ అంశాలను అధ్యయనం చేయాలి. ప్రతి విషయాన్ని పొలిటికల్ కోణంలోనే మదింపు చేసుకోవాలి. వాటన్నిటినీ వదిలేసి ఒక సమస్యపై ముఖ్యమంత్రితో చర్చలు జరపడం ప్రజలకు సరైన మెసేజ్ పంపదు. పవన్ కల్యాణ్ తెలిసో తెలియకో ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆడుతున్నారనే ప్రచారం ప్రబలంగా వ్యాపిస్తుంది. జనసేనాని వల్ల అధికారం కోల్పోయామని భావిస్తున్న విపక్షం ఈ అంశాన్నిఅవకాశం దొరికినప్పుడు రాజకీయ దుమారంగా మారుస్తుంది. ఉద్దానం కిడ్నీ సమస్య తీవ్రమైనదే. హార్వర్డు ప్రొఫెసర్లు వచ్చారు. అయితే ఈవిషయంలో ప్రభుత్వంతో చర్చలు జరపడానికి తన పార్టీలోని విశ్వాసపాత్రులైన వ్యక్తులను, పార్టీని అభిమానించే డాక్టర్లను పంపితే సరిపోతుంది. తానే వెళ్లి సీఎంతో ఏకాంతంగా కూర్చోవడం జనసేన భవిష్యత్ వ్యూహాలపై నీలినీడలు కమ్ముకొనేలా చేసింది.
పైపెచ్చు ఎటువంటి పరిస్థితులనైనా తనకు అనుకూలంగా మలచుకోవడంలో సిద్ధహస్తుడైన సీజన్డ్ పొలిటీషియన్ చంద్రబాబుతో మాట కలిపితే మళ్లీ పోరాటం చేయడం సాధ్యం కాదు. అసలే సున్నిత మనస్కుడు, రాజకీయాల్లో ఓనమాలు దిద్దుకుంటున్న పవన్ ఆలోచనలను తనవైపు తిప్పుకోవడం బాబుకు పెద్ద కష్టమేం కాదు. కాపుల ఉద్యమం, రాజధాని నిర్మాణం, పోలవరం వంటి అంశాలపై టీడీపీ ప్రభుత్వ వైఖరిని సమర్థించేలా పవన్ కల్యాణ్ మాట్లాడటంలో బాబు వ్యూహం ఫలించినట్లే చెప్పుకోవాలి. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షంగా పోటీ పడాలనుకుంటున్న జనసేన ప్రభుత్వ విధానాలకు వత్తాసు పలికితే లభించే రాజకీయ ప్రయోజనం శూన్యం. వీరి కలయిక వై.సి.పి.కి వరం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆ పార్టీవైపు పోలరైజ్ కావడానికి చక్కగా ఉపకరిస్తుంది. అందుకే రాజకీయాల్లో మంచి చేయాలనే తపన ఉంటే సరిపోదు. పూర్వాపరాలు, భవిష్యత్తు వ్యూహం కూడా ఎంతో కీలకం. అది లోపిస్తే పవన్ వంటి మంచోళ్లు ప్రశ్నించడానికే పరిమితమవుతారు. పాలనపగ్గాలు అందుకోవడం దుర్లభమవుతుంది. మంచి ఆశయాలు, సిద్ధాంతాలతో రాజకీయాలు చేద్దామనుకున్న లోక్ సత్తా వంటి పార్టీలు అడ్రసు లేకుండా పోవడానికి కారణమిదే అంటున్న విశ్లేషకులు













