ఘనంగా పరిటాల శ్రీరామ్ నిశ్చితార్థం
తెలుగుదేశం పార్టీ నేత, ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ నిశ్చితార్థం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్లో పరిటాల కుటుంబ సభ్యుల, అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని నార్పలకు చెందిన వ్యాపారవేత్త కుమార్తె ఆలం జ్ఞాన అనే యువతిని ఆయన వివాహం చేసుకోనున్నారు. నిశ్చితార్థ కార్యక్రమానికి ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, నందమూరితారకరత్న, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కాల్వ శ్రీనివాస్, కామినేని శ్రీనివాస్, అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తదితరులు హాజరయ్యారు. వీరితో పాటు అనంతపురం జిల్లా నేతలైన ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, జెడ్పీ చైర్మన్ చమన్సాబ్ హాజరైన శ్రీరామ్-జ్ఞాన జంటను ఆశీర్వదించారు. శ్రీరామ్ వివాహం అక్టోబర్ 1న నిర్వహించనున్నట్లు మంత్రి సునీత ప్రకటించారు.













