నాలెడ్జ్ హబ్ గా ఏపీ : చంద్రబాబు
ఆలోచనలతోనే మార్పు సాధ్యమవుతుందని, ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడలో విదేశీ విద్యకు ఎంపికైన విద్యార్థినీ, విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్ఞానభూమి ఆన్లైన్ పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం విదేశీ విద్యకు అర్హత పొందిన విద్యార్థులకు రూ.5లక్షల రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఎస్బీఐతో ప్రభుత్వం తరపున ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నాణ్యమైన విద్య, నైపుణ్యాలను పెంపొందించుకున్నపుడే అవకాశాలను అందిపుచ్చుకొని అభివృద్ధివైపు పయనించవచ్చని చెప్పారు. తెలివితేటలు, పట్టుదల కలిగిన వారికి చేయూతను అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. అందరికి ఒకే ఆశ ఒకే కల ఉంటుందని, పిల్లల కల జయప్రదం చేయడం ద్వారా వారి జీవితాల్లో సంతోషాన్ని నింపడమే తన లక్ష్యమన్నారు.








