భవిష్యత్తులో చైనాకు పోటీగా ఏపీ
భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో తయారయ్యే ఫోన్లే చౌకగా మార్కెట్లోకి వస్తాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖలో జరుగుతున్న మూడు రోజుల ప్రపంచ సృజన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ చైనాలో ప్రత్యేకించి సెల్ ఫోన్ల తయారీకే షెన్జెన్ పేరుతో నగరాన్నే సృష్టించారని అన్నారు. ఇదే తరహాలో ఏపీలోనూ రెండు క్లస్టర్లను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. రేణిగుంట విమానాశ్రయం బయట, శ్రీసిటీలో ఇలా రెండుక్లస్టర్లలో ఫోన్ల విడిభాగాల తయారీ నుంచి పనికిరాని ఫోన్లను (ఈ-వేస్ట్) తిరిగి వేరేలా వాడేవరకు అన్నీ అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. దీనిద్వారా తయారీ ఖర్చు బాగా తగ్గుతుందని వెల్లడించారు. భవిష్యత్తులో చైనాకు పోటీగా, వారికన్న తక్కువ ధరకు ఫోన్లను అందించేలా ఎదుగుతామని తెలిపారు. దీర్ఘకాలంగా మన్నే సాంకేతికతపై ఆవిష్కర్తలు దృష్టి పెట్టాలని సూచించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం ఉందని, ఇక్కడ తయారయ్యే సృజనాత్మక ఉత్పత్తులను ప్రపంచ విపణిలోకి చేర్చడంపై ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని తెలిపారు.








