పెట్టుబడులకు ఏపీ అనుకూలం
కోయంబత్తురులో ఆంధ్రప్రదేశ్ ఐటిశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎంటర్ ప్రెన్యూర్ ఆర్గనైజేషన్ ఆఫ్ కోయంబత్తూరు ఆధ్వర్యంలో జరిగిన ఎంటర్ ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్సు 2017 కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో అవార్డులు సాధించిన ఎంటర్ప్రెన్యూర్లకు మంత్రి లోకేష్ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉన్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులన్ని త్వరలోనే ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రానికి రావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.
పర్యాటక కేంద్రంగా పోలవరం :మీనా
పర్యాటక రంగానికి అంతర్జాతీయ హంగులు అద్దుతూ విభిన్న ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. పోలవరం, గండికోటను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడంలో భాగంగా కొన్ని సంస్థలు ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజంటేషన్ను ఆయన పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయగలమన్న దానిపై సమాలోచనలు చేస్తున్నామని తెలిపారు. దీనికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసే పనులను మూడు సంస్థలకు అప్పగించామని, ఆ సంస్థలు పవర్ సాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రాజెక్టు వివరాలను తెలియజేశాయని వివరించారు. కోటప్పకొండ అభివృద్ధి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మీనా తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ హిమన్షు శుక్లా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








