టీడీపీకి వ్యతిరేకంగా నంద్యాలకు క్యూ కట్టిన నేతలు
ఏపీ అంతా ఇప్పుడు నంద్యాల ఎన్నికల హీట్ లో కొట్టుమిట్టాడుతోంది. ఆ ఎన్నికల ప్రభావం వచ్చే సార్వత్రిక ఎన్నికల పైనా ఉంటుందని నమ్మి విపక్షాలు సర్వశక్తులూ ఒడ్డి అధికారపార్టీ పై యుద్ధం ప్రారంభించాయి. ముఖ్యంగా వైసిపి ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది . ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి సమక్షంలో టిడిపి తీర్ధం పుచ్చుకునే వారు కొందరైతే మరికొందరు నంద్యాలలో మంత్రుల సమక్షంలో సైకిల్ ఎక్కేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు వైసిపి లో చేరడానికి ఆసక్తి చూపే వారిని నంద్యాల రప్పించి కండువా కప్పేస్తున్నారు వైసిపి అధినేత. ప్రధాన పార్టీలు రెండు తమ పార్టీలోకి పోలోమంటూ వచ్చి చేరిపోతున్నారనే సంకేతాలు ప్రజలలోకి పంపి ఓటర్ల ను ఆకట్టుకునేందుకు కృషి చేస్తున్నాయి. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వున్న పార్టీల నేతలు నంద్యాల ఎన్నికల ప్రచారం కోసం వెళ్లడం విశేషం.
జగన్ తో భేటీ అవనున్న రోశయ్య ప్రియ శిష్యుడు…..
వైసిపి అధినేత వైఎస్ జగన్ ను కలిసి తాను పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించనున్నారు మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ప్రియ శిష్యుడు ఏపీఐఐసి మాజీ ఛైర్మెన్ శ్రీఘాకోల్లపు శివ రామ సుబ్రహ్మణ్యం. భారీ కార్ల ర్యాలీతో నంద్యాలకు బయల్దేరారు ఆయన. గత ఎన్నికల్లో సమైక్యాధ్ర పార్టీ తరపున రాజమండ్రి అర్బన్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన సుబ్రహ్మణ్యం తన వ్యక్తిగత బలంతో సుమారు 12 వేల ఓట్లకు పైగా సాధించి వైసిపి పరాజయానికి పరోక్షంగా బిజెపి అభ్యర్థి భారీ విజయానికి దోహద పడ్డారు. ఈ నేపథ్యంలో వైసిపిలో ఆయన చేరిక ఆ పార్టీలో కొత్త సమీకరణలకు తెర తీస్తుంది.
నంద్యాలకు మాజీ ఎంపీ హర్ష కుమార్ …..
దళితులపై రాష్ట్రంలో తీవ్రంగా దాడులు చేస్తున్నారని, అంబేద్కర్ విగ్రహాలకు కూడా టిడిపి సర్కార్ రక్షణ కల్పించలేకపోతుందని, దళిత సమస్యలపై పోరాడే వారిని పోలీసులతో నిర్బంధించి సర్కార్ వేధిస్తుందంటూ నంద్యాలలో ఓటర్ల ముందుకు వెళుతున్నారు మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్. దళితులు ఎవరు టిడిపి కి ఓటు వేయొద్దని చెప్పేందుకు ప్రచారానికి వెళుతున్న హర్ష కుమార్ మరి ఏ పార్టీ కి ఓటు వేయమంటారో ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఆయన్ను విభజన సందర్భంగా బహిష్కరించింది. వైసిపి పై కూడా ఇటీవల తీవ్ర విమర్శలు గుప్పించిన హర్ష దళిత ఓటర్లకు ఏమి చెబుతారో వేచి చూడాలి. ఇప్పటికే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో సఖ్యతగా ఉంటున్న హర్ష కుమార్ నంద్యాల యాత్ర ఆసక్తికరమే.








