నంద్యాల ఉప ఎన్నికకు విరామం
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన కర్నూలు జిల్లా నంద్యాల శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల వ్యవహారానికి తాత్కాలికంగా విరామం పడింది. అభ్యర్థి ఎంపిక విషయంలో అధికార పార్టీలో నెలకొన్న తీవ్రపోటీ, టిక్కెట్ తమకు కావాలంటే, తమకే కావాలంటూ భూమా, శిల్పా వర్గాలు పార్టీ అధినేత వద్ద పంచాయితీ పెట్టి పెద్ద సమస్యగా మారారు. ఒకానొక దశలో శిల్పా సోదురులు పార్టీని వీడిపోతారన్న సంకేతాలు వెలువడ్డాయి. మరోవైపు అదనను కోసం వేచిచూస్తూ, అధికార పార్టీకి ధీటుగా అభ్యర్థిని రంగంలోకి దించాలన్న ఎత్తుగడలతో ప్రతిపక్ష పార్టీలోనూ కసరత్తు జరిగింది. ఈ మధ్యలోనే నంద్యాల ఉప ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు విజయమ్మ, భూమా కుటుంబం మధ్య రాయభారాలు నడిచాయన్న వార్తలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో త్వరలోనే ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని, ప్రభుత్వం నిర్వహిస్తున్న నవనిర్మాణ దీక్షల అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరన్నది ఖరారు చేస్తారని, వైఎస్సార్సీ కూడా తన వైఖరిని సృష్టం చేస్తుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఉప ఎన్నికల వేడి చల్లబడింది.








