హెచ్‌సీఎల్ 500 కోట్ల పెట్టుబడి
ఐటీ దిగ్గజ సంస్థ హెచ్‌సీఎల్ విజయవాడ, అమరావతిలో రూ. 500 కోట్ల పెట్టుబడితో ఐటీ సెంటర్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హెచ్‌సీఎల్ చైర్మన్ శివనాడార్ సమక్షంలో ఇందుకు సంబంధించి ఇరుపక్షాల అధికారులు సంతకాలు చేశారు.
విజయవాడ చాలా శక్తిసంపన్నమైనదని ఇక్కడ విజ్ఞానవంతులకు కొదవలేదని రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా చేసేందుకు తాము చేస్తున్న కృషిలో హెచ్‌సీఎల్ భాగస్వామి కావాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆ సంస్థ చైర్మన్‌ను కోరారు. అలాగే సుందరమైన కృష్ణాతీరాన్ని రెండో నివాస ప్రాంతంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రీసెర్చ్, డెవలప్మెంట్ సెంటర్ నెలకొల్పేందుకు ఏపీ ఉత్తమ గమ్యస్థానంగా ముఖ్యమంత్రి చెప్పారు. సంస్థ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే అధికంగా వుండటంతో ఇక్కడ ఐటీ సెంటర్ నెలకొల్పాలని భావించానని శివనాడార్ అన్నారు. విజయవాడ, అమరావతిలో తమ సంస్థ కేంద్రాలు నెలకొల్పేందుకు వేగంగా అనుమతులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
రెండు దశలుగా ఐటీ కేంద్రాల ఏర్పాటు
రెండు దశలలో పదేళ్ల కాలంలో మొత్తం రూ. 500 కోట్ల పెట్టుబడులు పెడతామని ఒప్పందం కుదుర్చుకున్న హెచ్‌సీఎల్ సంస్థ ఐదు వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఇందులో మొదటి దశలో రూ. 300 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతో 3 వేల మంది ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే 2022లో చేపట్టే రెండో దశ విస్తరణలో భాగంగా రూ. 200 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 2 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి.













