రాజధాని డిజైన్లపై రాజమౌళితో చర్చలు
రాజధాని డిజైన్లపై సూచనలు చేయాల్సిందిగా మంత్రి నారాయణ, సీఆర్డీయే కమిషనర్ శ్రీధర్ దర్శకుడు రాజమౌళిని కోరారు. ముఖ్యమంత్రి సూచన మేరకు హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లోని రాజమౌళి ఇంటికి వెళ్లారు. ఐకానిక్ భవంతులైన అసెంబ్లీ, హైకోర్టులకు మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ రూపొందించిన డిజైన్లను రాజమౌళికి మంత్రి నారాయణ చూపించారు. ఈ భవంతులు మనవైన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టాలని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గతంలో వెల్లివిరిసిన నాగరికత, వెలుగొందిన పలు రాజవంశాల ఘనత, నిర్మాణ శిల్పకళారీతులను ప్రతిబింబించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని డిజైన్లలో ఏమేం మార్పులు చేస్తే బాగుంటుందో సూచించాలని రాజమౌళిని కోరారు. ఈ డిజైన్లను నిశితంగా పరిశీలించి, త్వరలో ముఖ్యమంత్రిని కలిసి తన ఆలోచనలు చెబుతానని రాజమౌళి తెలిపారు.













