స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నిలబడతాం: మంత్రి నారా లోకేష్
విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు శాశ్వతంగా అండగా నిలబడతామని, పరిహారం ప్రకటించి చేతులు దులుపుకోం అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రూ.15వేల కోట్ల ప్యాకేజీతో విశాఖ ఉక్కును కాపాడుకున్నాం. తిరిగి ఉత్పత్తి కూడా ప్రారంభించాం. ఇలాంటి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ లో సోమవారం జరిగిన ప్రమాదం చాలా బాధాకరం. బెస్ట్ టెక్నాలజీ ఉన్న ప్లాంట్ ఇది. ప్రమాదం జరిగిన వెంటనే కలెక్టర్, సీపీ, హోంమంత్రి, స్థానిక ఎంపీ, పల్లా గారు వచ్చారు. సోమవారం రాత్రి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు స్వయంగా వచ్చి పరిస్థితులను సమీక్షించారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కూడా వచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.
ఈ రాత్రికే ముందుగా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం
నేను కేవలం చెక్ ఇవ్వడానికి రాలేదు. బాధిత కుటుంబాలకు శాశ్వతంగా అండగా నిలబడేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ముందడుగు వేసింది. పర్మినెంట్ అయినా, కాంట్రాక్ట్ అయినా మృతుల కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని కేంద్ర మంత్రి కుమారస్వామి గారు పెద్దమనసుతో హామీ ఇచ్చారు. గతంలో ఈవిధంగా ఎక్కడా జరగలేదు. అవసరమైతే దీనిని కేబినెట్ కు కూడా తీసుకెళ్తానని ఆయన చెప్పారు. తనదీ బాధ్యత అని చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా నిలబడాల్సిన బాధ్యత మాపై ఉంది. స్టీల్ ప్లాంట్ రూల్స్ ప్రకారం కొంతమందికి ఎక్కువ ఎక్స్ గ్రేషియా అందుతుంది. ఎంతుంటే అంత ఇవ్వాలి. ఇప్పటికే సీఎండీ చాలా స్పష్టంగా చెప్పారు. కుమార స్వామి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మొదటి విడత కింద మృతి చెందిన 8 కుటుంబాలకు ఈ రోజు రూ.25 లక్షలు పరిహారం అందజేస్తాం. దానితర్వాత రావాల్సిన ఎక్స్ గ్రేషియా, పీఎఫ్ నగదు, స్టీల్ ప్లాంట్ నుంచి రావాల్సింది కూడా మొత్తం కాలిక్యులేట్ చేసి ఆయా కుటుంబాల అకౌంట్ లో వేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అంత్యక్రియల అనంతరం అందరం మరోసారి చర్చించి ఏం చేయాలో ఆలోచన చేస్తాం. బాధిత కుటుంబాల పిల్లలు సొంత కాళ్లపై నిలబడేలా చేయాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వంపై ఉంది.
స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై కమిటీ నివేదిక తర్వాత చర్యలు
గతంలో విశాఖ ఉక్కును ఎన్డీఏ ప్రభుత్వం ఏవిధంగా కలిసికట్టుగా కాపాడిందో అదేవిధంగా కార్మికుల కుటుంబాలకు మేం అండగా నిలబడతాం. ప్రమాదంపై ఇప్పటికే కమిటీని నియమించారు. ఉక్కుద్రవం పొంగడం కాకుండా పైనుంచి కక్కడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. దీనిపై క్షుణ్ణంగా పరిశీలన జరుగుతుంది. కమిటీ నివేదిక తర్వాత ఏం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ రోజు క్షతగాత్రుల్లో ఒకరైన శ్రీనివాసరావును కలిశాను. విశాఖ ఉక్కును కాపాడాలని చెప్పారు.
స్టీల్ ప్లాంట్ లో ప్రాసెస్ లో ఎక్కడా లోపం లేదు
స్టీల్ ప్లాంట్ లో తక్కువ మంది కార్మికులు ఉండటం వల్ల ఈ ప్రమాదం జరగలేదు. ప్రాసెసింగ్ లో ఎలాంటి పొరపాటు, తేడాలు లేవు. లాడిల్ భారీ శబ్దంతో ఒక్కసారి పేలిపోయింది, కక్కింది. ఇది ఎందుకు జరిగిందో తెలియదు. స్టీల్ ప్లాంట్ లో వినియోగించే రష్యన్ టెక్నాలజీ బెస్ట్ టెక్నాలజీనే. కమిటీ నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం.
విశాఖ ఉక్కుకు స్లర్రీ పైప్ లైన్ తీసుకువచ్చే బాధ్యత ప్రభుత్వానిది
విశాఖ ఉక్కుకు కూడా స్లర్రీ పైప్ లైన్ వేయాలి. దీనిపై ఏనాడు ఏ కార్మిక సంఘం నాయకులు మాట్లాడలేదు. విశాఖ ఉక్కుకు స్లర్రీ పైప్ లైన్ కూడా తీసుకువచ్చే బాధ్యత ప్రభుత్వానిది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకున్నాం. కార్మికులను చూసుకునే బాధ్యత నాది. పరిహారం అందించి చేతులు దులుపుకుని పోవాలని కార్మిక నేతలు మాట్లాడుతున్నారు. ఇది సరికాదు. ఎక్స్ గ్రేషియా ఇస్తాం. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అసలు మీరు ప్యాకేజీ ఇవ్వకుంటే ప్లాంట్ తెరుచుకునేదికాదని, ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని మాట్లాడుతున్నారు. ప్రజలు కూడా ఆలోచించాలి. వారు అడిగిన ఎక్స్ గ్రేషియా కంటే రెగ్యులర్ ఉద్యోగులకు ఇంకా ఎక్కువ వస్తుంది.
మృతుల కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తాం
పర్మినెంట్ అయినా, కాంట్రాక్ట్ అయినా మృతుల కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తాం. ఇదీ ఎన్డీయే చిత్తశుద్ధి. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు మేం వచ్చిన తర్వాత న్యాయం చేశాం.
బాధిత కుటుంబాలకు పరామర్శ
అంతకుముందు విశాఖ కేజీహెచ్ కు వచ్చిన మంత్రి నారా లోకేష్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం సెవెన్ హిల్స్, కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అనంతరం స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. కార్మికులతో మాట్లాడి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మంత్రి లోకేష్ తో పాటు కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి సంధ్యారాణి, ఎంపీ శ్రీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్ బాధితులను పరామర్శించారు.








