విద్యారంగంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలవాలి : గంటా
ఎన్ఇసి కాలేజీల ఆధ్వర్యంలో స్టార్టప్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం ఆనందంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఉన్నత విద్య సలహాదారు డాక్టర్ వెంకట్ ఈదర, అమెరికాలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కోమటి జయరాం తదితరులతో కలిసి విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అమెరికా దేశంలోని ఒహియో రాష్ట్రంతో ఒప్పందం చేసుకున్నామని దీనివల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి ఎం.ఎస్, ఫార్మారంగంలో విద్యను అభ్యసించాలనుకునే వారికి ఆ రాష్ట్రంలో చేరే యూనివర్సిటీలలో 75శాతం రాయితీ వర్తిస్తుందన్నారు. ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ.2లక్షలు నుంచి 4 లక్షల వరకు ఆదా అవుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఒహియో రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకోపోతే ఒక్కో విద్యార్థి 14,676 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని ఈ ఎంవోయూ ద్వారా మన రాష్ట్రం నుంచి వెళ్లే విద్యార్థులు 8,800 డాలర్లు చెల్లిస్తే సరిపోతుందన్నారు. స్థానిక రాష్ట్రానికి చెందిన విద్యార్థులు 7,388 యూఎస్ డాలర్లు చెల్లిస్తారన్నారు. ఈ వ్యత్యాసం ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎంవోయూ కుదుర్చుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రం నుంచి 4 నుంచి 5వేల మంది విద్యార్థులు పీజీ కోర్సులు చేయడానికి వెళ్లుతున్నారన్నారు. ఇతర దేశాలలోని విశ్వవిద్యాలయాలతో పాటు అమెరికాలోని ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాలతో కూడా ఎంవోయూ కుదుర్చుకోన్నుట్లు తెలిపారు.
రాష్ట్రంలో 7 ప్రముఖ కేంద్ర విశ్వవిద్యాలయాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితరమైనవి ఏర్పాటు చేయడంతో పాటు 5యూనివర్సీటీలలో అడ్మిషన్స్ ప్రారంభించామన్నారు. సెంట్రల్ యూనివర్సీటీ, గిరిజన యూనివర్శిటీలకు సంబంధించి అనుతులు రావలసి ఉందన్నారు. ఇప్పటికే సెంట్రల్ యూనివర్శిటీని అనంతపురంలో ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, స్కూల్స్‌లలో మౌలికసదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తున్నామని ఇందుకోసం రూ.3488 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ప్రైవేట్ విద్యా బిల్లు వల్ల ప్రపంచంలో పేరిన్నిక గల ఎస్ఆర్ఎం, విట్ లాంటి సంస్థలు రాష్ట్రానికి రావడానికి వీలు ఏర్పాడిందన్నారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడానికి రాష్ట్రంలో ఒక మోడల్ యాక్ట్‌ను తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి ప్రజలతో, అధ్యాపక అసోసియేషన్స్ తో సంప్రదింపులు జరిపి ఈ రెగ్యులేటరి మోడల్ యాక్ట్ బిల్లు తీసుకురావడం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలలో 5 జిల్లాలలో ఇంచార్జీలే ఉన్నారన్నారు. ఈ నెలాఖరులోపు జిల్లా విద్యాధికారులను నియమించనున్నట్లు తెలిపారు.








