అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో మెగా శిల్పారామం
అరకు కేంద్రంగా కళా గ్రామం ఏర్పాటు చేయనున్నట్టు పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన శిల్పారామం కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేతి వృత్తులు, కళలు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రతి జిల్లా లోనూ ఒక శిల్పారామం అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగానే ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. చేతి వృత్తుల వారు తమ ఉత్పత్తులను, కళాకృతులను నేరుగా విక్రయించుకోగలిగేలా శిల్పారామం పని చేస్తుందని తెలిపారు. అమరావతి వేదికగా అంతర్జాతీయ ప్రమాణాలతో మెగా శిల్పారామం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇది ఏపీ సాంస్కృతిక వైభవాన్ని ప్రతి బింబించేలా ఉంటుందని అన్నారు.








