దానికి పూర్తి బాధ్యత వహిస్తూ .. సీఎం రేవంత్ రాజీనామా చేయాలి: కిషన్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టెన్త్, ఇంటర్ ప్రశ్నపత్రాల లీకేజీ జరిగిందని, దానికి పూర్తి బాధ్యత వహిస్తూ, విద్యాశాఖ మంత్రిగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాజీనామా చేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) డిమాండ్ చేశారు. ఢిల్లీలోని తన నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహించి ధర్మంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) మంత్రి పదవికి రాజీనామా చేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి సంస్థకి సుమారు రూ.54 వేల కోట్ల బకాయిలు పెట్టాయని, సంస్థ అభివృద్ధికి ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని పీకేవోసీ (ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్) డిప్‌సైడ్ ఎక్స్‌టెన్షన్‌ను వేలం ప్రక్రియలో అందుబాటులోకి తెచ్చాం. ఈ బ్లాక్ సింగరేణికి రావాలని నా తాపత్రయం. అయితే తెలంగాణ జెన్కో సింగరేణికి పోటీదారుగా టెండర్లో పాల్గొంది. జెన్కో టెండర్ల ప్రక్రియ నుంచి వెనక్కి తగ్గి సింగరేణికి దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తాను. 2014లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ (KCR), సింగరేణి వేలంలో పాల్గొనకుండా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ (Congress) ప్రభుత్వ వైఖరి కూడా అలానే ఉంది అన్నారు.








