దసరాకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి
దసరా మహోత్సవాలకు జెజవాడ కనకదుర్గమ్మ ఆలయం సర్వం సిద్ధమైంది. అమ్మవారి ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించడంతో ఆలయం విద్యుద్దీపకాంతులతో మిరిమిట్ల గొలుపుతూ దేదీప్యమానంగా వెలుగొందుతున్నది. ప్రముఖ దివ్యక్షేత్రం శ్రీదుర్గామల్లేశ్వర దేవస్థానం ఆధ్యర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మహోత్సవాలను అత్యంత వైభోవోపేతంగా కనుల పండువగా నిర్వహించేందుకు ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేసింది. రాష్ట్రం నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భారీ ఎత్తున భ్త జనం తరలివస్తుంటారు. ఇప్పటికే ఎంతో మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు చేరుకున్నారు. బుధవారం రాత్రికే వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు క్యూలైనల్లో నిల్చున్నారు. ఈసారి సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. భక్తులు స్వేచ్చగా క్యూలైన్లో వచ్చి, అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రత్యేకించి, బారికేడ్లు ఏర్పాటు చేశారు. గత అనుభవాలను గమనంలో ఉంచుకుని సామాన్య భక్తులకు పెద్దపీట వేయడమే కాకుండా వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచడం గమనార్హం.








