న్యాయఫలం.. అందరికీ సమం
సమాజంలో ఆర్థిక అసమానతలు సాధారణమని.. అయితే న్యాయవ్యవస్థ ఫలాలు మాత్రం అందరికీ సమానంగా అందుతాయని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వెంకట జ్యోతిర్మయి అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ న్యాయ సేవ సాధికార సంస్థ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన మెగా లోక్ అదాలత్ను శనివారం ఆమె ప్రారంభించారు. జడ్జి మాట్లాడుతూ వివిధ కేసుల్లో రాజీ అనేది కక్షిదారులకు గుదిబండ కాకూడదన్నారు. రాజీ సత్వర ఫలాలను అందించాలని ఆకాంక్షించారు. మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి ఎస్.నాగార్జున మాట్లాడుతూ ఉభయులు తమ వ్యాజ్యాల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ని ఆశ్రయించడం వల్ల శాశ్వత ఫలాలు పొందవచ్చన్నారు. విశాఖ జాయింట్ కలెక్టర్ సృజన మాట్లాడుతూ వివాదాలను ఆమోదయోగ్యంగా రాజీ చేసుకోవడానికి లోక్ అదాలత్లో శాశ్వత, చట్టబద్ధమైన తీర్పులు వస్తాయన్నారు.
పౌరశిక్షస్మృతి పరిధిలోని కేసుల, ప్రభుత్వ వివాదాల పరిష్కారానికి తమవంతు సహాయం అందిస్తామన్నారు. లోక్ అదాలత్ కార్యదర్శి సనపల దామోదరరావు, కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తి కె.సాయి రమాదేవి, 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి యు.సత్యారావు, సీపీ టి.యోగానంద్, అదనపు పోలీస్ సూపరింటెండెంట్ శ్రీకాంత్, జాయింట్ పోలీస్ కమిషనర్ నాగేంద్రకుమార్, విశాఖ న్యాయవాదుల సం ఘం అధ్యక్షుడు పూసర్ల బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి కాం డ్రేగుల జగదీశ్వరరావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు, న్యాయసేవా అధికార సంస్థ సీనియర్ సభ్యులు హెచ్వీఎస్ ప్రసన్నకుమార్, జాతీయ శిక్షకుడు ఆర్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 8 వేలకు పైగా కేసులు రాజీకి వచ్చాయి.
కేసుల రాజీలో ఏపీలో నంబర్ వన్
విశాఖ జిల్లాలో జరిగిన మెగా లోక్ అదాలత్లో అత్యధిక సంఖ్యలో కేసులు రాజీ అయ్యాయి. రాష్ట్రంలో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. శనివారం జరిగిన ఈ అదాలత్లో పౌర శిక్షాస్మృతి పరిధిలోని 538, క్రిమినల్ కేసులు 7,181, పూర్వ, ప్రాథమిక వివాదాలకు సంబంధించి 76 కేసులు రాజీ అయ్యాయి. జిల్లాలో అన్ని న్యాయస్థానాల్లో కలిపి 7,795 కేసులు రాజీ చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. దీనికి సంబంధించి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వెంకట జ్యోతిర్మయి మాట్లాడుతూ న్యాయవాదులు, న్యాయమూర్తులు, కక్షిదారులు, సిబ్బంది, అధికారుల సహకారంతోనే ఈ స్థాయిలో నిలిచామన్నారు. ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయడంవల్ల ఈ ఫలితం లభించిందన్నారు.








