త్వరలో జనసేన సభ్యత్వ నమోదు
జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు ఆ పార్టీ అధినేత సినీ నటుడు పవన్ కల్యాణ్ తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే విషయమై జనసేన పరిపాలన కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. పూర్తిగా ఆన్లైన్లో జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించి సాఫ్ట్వేర్ సాంకేతిక వివరాలను జనసేన ఐటి విభాగం నిపుణులు పవన్ కల్యాణ్‌కు వివరించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సాఫ్ట్వేర్, యాప్ప్లను పరిశీలించిన పవన్ కల్యాణ్ కొన్ని మార్పులు, చేర్పులను ఐటి నిపుణులకు సూచించారు. జనసేన ఐటి విభాగం రూపకల్పన చేసిన సభ్యత్వ నమోదు సాఫ్ట్వేర్, యాప్స్‌పై ఆయన పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను పలుమార్లు పరిశీలించిన తర్వాతే పవన్‌కల్యాణ్‌కు చూయించినట్లు ఐటి నిపుణులు తెలిపారు. ట్రయల్ రన్ సంతృప్తికరంగా ఉన్నట్లు పవన్‌కు వివరించారు. కొద్ది రోజుల్లోనే సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించబోతున్నట్లు ఈ సందర్భంగా వపన్ కల్యాణ్ తెలిపారు.













