అందువల్ల సభలో చేయగలిగింది ఏమీ లేదు : వైఎస్ జగన్
శాసనసభలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేదని, అందువల్ల సభలో చేయగలిగింది ఏమీ లేదని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) వ్యాఖ్యానించారు. శాసనసభలో తాను చెప్పదలచుకున్న వాటిపై ప్రెస్మీట్లలో మాట్లాడతానన్నారు. సోమవారం నుంచి అసెంబ్లీ (Assembly) సమావేశాల నేపథ్యంలో ఆయన తన క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యేలు (MLAs), ఎమ్మెల్సీల (MLCs)తో సమావేశమయ్యారు. రైతుల సమస్యలు, పీపీపీ, ఫీజు రీయింబర్స్మెంట్, దిశ, వైసీపీ నేతల అరెస్టులు, విజన్-2047, శ్వేతపత్రాలు తదితర అంశాలపై మండలిలో మాట్లాడాలని ఎమ్మెల్సీలకు జగన్ సూచించారు. డీఎస్సీ-2025నే ప్రధాన ఎజెండా అని, దీనిపై శాసనమండలిలో గట్టిగా మాట్లాడాలని జగన్ వెల్లడించారు. డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) రాజీనామా చేయాల్సిందే. సీబీఐ దర్యాప్తు జరగాలి. ఈ అంశాలపై గట్టిగా నిలదీయండి అని ఎమ్మెల్సీలకు స్పష్టం చేశారు. డీఎస్సీ (DSC) పై శాంతియుతంగా ర్యాలీలు చేసినవారిపై కేసులు పెట్టారని ఆరోపించారు. దీనిపై కోర్టులను ఆశ్రయిస్తామన్నారు.








