అడ్డుపడేవారి అడ్రస్ గల్లంతే : చంద్రబాబు
సంక్షేమ కార్యక్రమాల అమలులో రాజకీయాలకు చోటులేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాల్సిందేనని ఆయన చెప్పారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం తెట్టంగిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానికుల ఇళ్ల వద్దకు వెళ్లి వారి సమస్యలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల అమలుతీరుపై వాకబు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెట్టంగి అన్ని విధాల అభివృద్ధి చెందాలన్నారు. తెలుగు జాతి కోసం రాత్రింబవళ్లు కష్టపడతా అని చెప్పారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నట్లు తెలిపారు. రైతులకు రుణవిముక్తి కల్పించామన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు కొంతమంది అడ్డుపడుతున్నారని, అలాంటి వారిని అడ్రస్ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తామని, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పడకూడదన్నదే తమ అభిమతమని అన్నారు.








