అమరావతి అభివృద్ధికి జపాన్ సహకారం : చంద్రబాబు
అమరావతి అభివృద్ధికి, పారిశ్రామిక ప్రగతికి సహాయ సహకారాలు అందించేందుకు జపాన్ ముందుకొచ్చింది. ఐదు అంశాల్లో రాష్ట్రాభివృద్ధికి సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు జపాన్ ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వశాఖ (మేటీ), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహనకు వచ్చి సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి, జపాన్ విదేశీ వాణిజ్య సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు అపారంగా ఉన్నాయని, అమరావతి ఇందుకు అనువైందన్నారు. జపాన్ రాజధాని టోక్యో కంటే అద్భుతమైన నగరంగా అమరావతిని అభివృద్ధి చేయాలని టకాగేని కోరారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు ఇప్పటికే సింగపూర్ ప్రభుత్వం ముందుకొచ్చిందని, జపాన్ కూడా ఇదే తరహాలో భాగస్వామి కావాలని కోరారు. సింగపూర్, జపాన్లలో నైపుణ్యం ఆర్థిక వనరులు ఉంటే భారత్లో సహజవనరులు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. జపాన్, ఏపీ మధ్య పరస్పర అవగాహన మరింత పెరిగేందుకు వీలుగా ప్రతి ఆర్నెళ్లకు జపాన్ ప్రభుత్వం ప్రతినిధులు ఏపీకి రావాలని, అదేవిధంగా ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు కూడా ప్రతి ఆర్నెళ్లకోసారి జపాన్లో పర్యటిస్తే బాగుంటుందని సూచించారు. రాష్ట్రాన్ని రెండో ఇల్లుగా భావించాలని జపాన్ మంత్రి టకాగీ, పారిశ్రామిక ప్రతినిధులను కోరారు. జపాన్ నుంచి అమరావతికి నేరుగా విమానాలను నడుపుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు.








