వెంకన్న భక్తులకు ఊరట
తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లపై జీఎస్టీ ఎత్తివేతకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సుముఖత వ్యక్తం చేశారు. ఢిల్లీలో తనతో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదనకు ఆయన అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించిన పలు అంశాలపై సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన ఫైబర్‌గ్రిడ్‌కు జీఎస్టీ ఎత్తివేతపై కౌన్సిల్ చర్చిస్తామని జైట్లీ తెలిపారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిధులపై ముఖ్యమంత్రి చంద్రబాబు, జైట్లీ కూలకషంగా చర్చించారు. పోలవరం సవరించిన అంచనాలు ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని జైట్లీని ముఖ్యమంత్రి కోరారు. దీనికి జైట్లీ సానుకూలంగా స్పందించారు. పోలవరం బకాయిలు రూ.3వేల కోట్లు చెల్లించేందుకు అంగీకరించారు. దీంతో పాటు ఏపీ రెవెన్యూ లోటు భర్తీపైనా కేంద్రం సానుకూలంగా స్పందించింది. భర్తీ అంశాన్ని త్వరగా పూర్తిచేయాలని పీఎంవో ఆర్థికశాఖకు సూచించింది. దీనిపై రాష్ట్ర అధికారులతో కూలకషంగా కేంద్ర ఆర్థిక శాఖ చర్చించనుంది. పూర్తి వివరాలతో త్వరలో ఆర్థికశాఖ నిర్ణయం తీసుకోనుంది.








