వైభవంగా శ్రీవారి గరుడసేవ
శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాల్లో బుధవారం నిర్వహించిన గరుడ సేవా వైభవంగా జరిగింది. రాత్రి 7:50 గంటలకు ప్రారంభమై ఈ సేవ మాడవీధుల్లో సంగీత, వాద్య, కోలాట, నృత్య బృందాల ప్రదర్శనల మధ్య దాదాపు 5 గంటల సేపు సాగింది. తిలకించడానికి లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు పోటెత్తారు. ఇక, సాయంత్రం ఊంజల్ సేవ అనంతరం మలయప్పస్వామిని వాహన మండపానికి వేంచేపు చేశారు. మూలవర్లకు అలంకరించే వజ్రాలతో పొదిగిన శంఖు, చక్రాలు, కౌస్తుభం, స్వర్ణ లక్ష్మీహారం, మకర కంటి, పచ్చలహారం, ఈ ఏడాది ఉత్సవాల తొలిరోజు ఓ దాత కానుక అందించిన నూతన సహస్రనామ స్వర్ణ హారం, ప్రభుత్వం సమర్పించిన పట్టువస్త్రాలు తదితరాలను 6 గంటలకు వాహన మండపానికి తీసుకొచ్చారు. మలయప్పను గరుడ వాహనంపై అధిష్టింపచేసి విశేషమైన ఆభరణాలు, భారీ గజమాలను అలంకరించారు. సాయంత్రం 7 గంటల సమయంలో ఆలయం, వాహన మండపం పైభాగంలో ఓ గరుడపక్షి చక్కర్లు కొట్టడంతో భక్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు.








