గన్నవరం ఎయిర్ పోర్టుకు అంతర్జాతీయ హోదా
గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాను కల్పిస్తూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేయడంతో మరో మూడు నెలల్లో తొలి విమానం విదేశాలకు ఎగరనుంది. గన్నవరం నుంచి తొలుత దుబాయికి సర్వీసులు ఏర్పాటు చేయనున్నారు. అంతర్జాతీయ సేవలను అందించేందుకు వీలుగా విమానాశ్రయంలోని పాత టెర్మినల్ భవనాన్ని రూ.2.5 కోట్లతో ఆధునికీకరిస్తున్నారు. జులై 31 నాటికి భవనం సిద్ధమవుతుంది. గన్నవరం నుంచి దుబాయ్‌కు తొలుత సర్వీసులను నడపాలనే యోచనతో పౌరవిమానయాన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సంస్థతో చర్చలు జరుపుతున్నారు. దుబాయ్‌కు కనీసం వారంలో రెండు విమాన సర్వీసులను ఏర్పాటు చేయాలని పారిశ్రామిక, వాణిజ్య సంఘాలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. ఉత్తర అమెరికా, కెనడ, ఆస్ట్రేలియా సహా ప్రపంచంలో ఎక్కడికైనా దుబాయ్ నుంచి తేలికగా విమాన కనెక్టివిటీ ఉందంటూ పౌరవిమానయాన శాఖకు, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లేఖలు రాసినటు ఛాంబర్ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ వెల్లడించారు.








