ఫార్మా రంగ అభివృద్ధికి భారీ క్లష్టర్లు
ఫార్మా రంగ అభివృద్ధికి ఏపీలోని 4 వేర్వేరు ప్రాంతాలలో భారీ క్లష్టర్లు ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. అచ్యుతాపురం-రాంబిల్లి, కృష్ణపట్నం, పులివెందుల, డిండి ప్రాంతాలలో ఈ క్లష్టర్లు ఏర్పాటు చేస్తున్నామని సోమవారం రాత్రి సచివాలయంలో రాష్ట్రానికి చెందిన ఫార్మా ఎక్స్‌పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డ్రగ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు, పలు ఫార్మా సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో ఔషధ రంగ అభివృద్ధిపై చర్చించారు. ఔషధ రంగంలో ఏపీని దేశానికే ముఖ్యకేంద్రంగా మార్చాలన్నదే తన ప్రయత్నమని చెప్పారు. హైదరాబాద్‌ను గొప్ప ఫార్మాసిటీగా అభివృద్ధి చేయడానికి ఆనాడు తాను జరిపిన కృషిని ప్రస్తావించారు.
నవ్యాంధ్రప్రదేశ్ నుంచి రూ.12 వేల కోట్ల మేర ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయని, 39,162 మంది ఈ రంగంలో ఉద్యోగ, ఉపాధి పొందుతున్నారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 162 ఫార్మా యూనిట్లు ఉండగా, రానున్న కొద్దికాలంలో ఈ సంఖ్య రెండు, మూడు రెట్లు పెరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకోసం నాలుగు క్లష్టర్లను ఏర్పాటు చేసి వాటికి కావలసిన అన్ని మౌలిక వసతులను ఏర్పాటుచేస్తామని తెలిపారు.








