షార్ భద్రతకు డ్రోన్ కెమెరాలు
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ భద్రతకు డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని భద్రతాధికారులు నిర్ణయించారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో షార్ భద్రతపై తమిళనాడు, ఆంధ్ర పోలీసు, నిఘా అధికారులు, కోస్ట్‌గార్డు, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల అధిపతులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. గతంలో భద్రతపై సమన్వయ సమవేశం జరిగిన తర్వాత నుంచి నేటి వరకు తొమ్మిది రాకెట్ ప్రయోగాలు జరిగాయని, ఇందులో భద్రతపరంగా అన్నీ ఏర్పాట్లు చేశారని, షార్ భద్రతకు ఇబ్బందేమీ లేదని షార్ నియంత్రణాధికారి జేవీ రాజారెడ్డి తెలిపారు. ఇదే పద్ధతిని కొనసాగించాలని చెప్పినట్లు సమాచారం. ఇంటిలిజెన్సీ సెక్యూరిటీ వింగ్ డీఐజీ జె.సత్యనారాయణ షార్‌లో డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, దాంతోపాటు స్మార్ట్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. దేశంలో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని, ఉగ్రవాదుల కదలికలు ఎక్కడ ఉంటాయో చెప్పలేని స్థితిలో ఉన్నామని, దీనిని దృష్టిలో ఉంచుకుని షార్ భద్రత పరంగా చర్యచలు తీసుకోవాలని సూచించారు.








