షర్మిలకు ఢిల్లీ పిలుపు, రాజ్యసభ ఖాయం..?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Ys Sharmila) కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు అత్యవసరంగా ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఆమె కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో(Rahul Gandhi) కీలక భేటీ జరిపారు. ఏపీలో పార్టీ పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణతో పాటు ఆమెకు పార్లమెంటులో కీలక బాధ్యతలు అప్పగించే అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే షర్మిలను రాజ్యసభకు పంపేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం సుముఖత వ్యక్తం చేసిందనే ప్రచారం జోరందుకుంది.
రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు సభ్యులను గెలిపించుకునే బలం ఉంది. ఈ ముగ్గురిలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి కర్ణాటక నుంచే రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించడం దాదాపు ఖాయమైంది. ఇక మిగిలిన రెండు స్థానాల్లో ఒక దానిని వైఎస్ షర్మిలకు కేటాయించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలోనే ఆమెకు ఇచ్చిన హామీ ప్రకారం ఈ విడతలో పెద్దల సభకు పంపేందుకు రాహుల్ గాంధీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్తున్నారు.
వైఎస్ షర్మిల రాజ్యసభకు ఎన్నికైతే.. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ తరఫున గళం విప్పడానికి, అలాగే ఏపీలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఆమెకు ఒక పవర్ఫుల్ ప్లాట్‌ఫారమ్ దక్కినట్లవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కర్ణాటక కేబినెట్ కసరత్తుల కోసం ఇప్పటికే సిద్ధరామయ్య ఢిల్లీలోనే ఉన్న తరుణంలో.. షర్మిల రాజ్యసభ సీటుపై అధిష్ఠానం త్వరలోనే ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి







