పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని ప్రజాసేవలోకి రావాలి : చంద్రబాబు
కుడి భుజానికి ఆపరేషన్ చేయించుకున్న ఉప ముఖ్యమంత్రిని పరామర్శించిన అనంతరం మీడియాతో సీఎం చంద్రబాబు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని మళ్లీ ప్రజాసేవలో చురుగ్గా పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ముంబైలో కుడి భుజానికి రొటేటర్ కఫ్ శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకోవడంతో పాటు, చికిత్స వివరాలను పరిశీలించారు. వైద్యుల సూచనలు పాటించి పూర్తిస్థాయిలో కోలుకోవాలని పవన్ కళ్యాణ్‌కు సీఎం సూచించారు. ముంబైలో పవన్ కళ్యాణ్ చికిత్స చేయించుకుంటున్న ఆస్పత్రికి చేరుకున్న ముఖ్యమంత్రిని మంత్రి నాదెండ్ల మనోహర్ స్వాగతించారు. ఉప ముఖ్యమంత్రిని పరామర్శించేందుకు ముంబై వెళ్లిన సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఆరోగ్య పరిస్థితితోపాటు.. వివిధ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ముంబైలోని మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతోందని, వీలైనంత త్వరగా తిరిగి పరిపాలనా కార్యకలాపాల్లో పాల్గొనాలనే ఉత్సాహంతో ఉన్నారని తెలిపారు. భుజాలకు సంబంధించిన సమస్య కారణంగా ప్రస్తుతం కుడి భుజానికి రొటేటర్ కఫ్ శస్త్రచికిత్స నిర్వహించారని, మరో మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రజాసేవ పట్ల అపారమైన అంకితభావంతో ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా పవన్ కళ్యాణ్ నిరంతరం పని చేస్తుంటారని, అయితే విశ్రాంతి లేకుండా పనిచేస్తే అనవసర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అందుకే ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు వెల్లడించారు. ప్రజల కోసం తపనతో పనిచేసే నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడిన ముఖ్యమంత్రి, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా, పాలనా కార్యకలాపాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. ఎడమ భుజానికి కూడా స్వల్ప సమస్య ఉన్నప్పటికీ, శస్త్రచికిత్స అవసరం లేకుండా ఫిజియోథెరపీ ద్వారా నయం చేసే అవకాశాలను వైద్యులు పరిశీలిస్తున్నారని ముఖ్యమంత్రి వివరించారు.
వియత్నాం ఘటనపై నిరంతర పర్యవేక్షణ
ఇక వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. పర్యాటక యాత్రకు వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ప్రమాదానికి గురికావడం అత్యంత దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టామని, అక్కడ చిక్కుకుపోయిన మిగిలిన పర్యాటకులను సురక్షితంగా ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంతో నిరంతర సమన్వయంతో ఉన్నామని చెప్పారు. మరోవైపు ప్రధాని విదేశీ పర్యటనలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సీఎం చంద్రబాబు సమాధానమిచ్చారు. ప్రపంచ వేదికలపై భారతదేశ ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన నాయకుడు మోదీ అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచ దేశాలన్నింటిలోనూ ప్రధాని మోదీకి విశేష గౌరవం లభిస్తోందని, సరైన సమయంలో దేశానికి సరైన నాయకత్వం లభించిందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా ప్రధాని మోదీ చేస్తున్న కృషి ఫలిస్తుందని, ఆయన నాయకత్వంలో భారత్ ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందనే విశ్వాసాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు.








