రైతు బజార్లకు పూర్వ వైభవం: ముఖ్యమంత్రి చంద్రబాబు
రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా ‘స్టేట్ ఫుడ్ కమిషన్’కు పూర్తి జవసత్వాలు కల్పిస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ఆహార భద్రతతో పాటు ధరల నియంత్రణ, నాణ్యత గల పౌష్టికాహారాన్ని అందించడం వంటి బాధ్యతలతో ఈ కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని తెలిపారు. సచివాలయంలో ముఖ్యమంత్రి పౌర సరఫరాల మంత్రి పత్తిపాటి పుల్లారావుతో కలిసి ఫుడ్ కమిషన్, రైతు బజార్లు, విలేజ్ మాల్స్ వంటి అంశాలపై సమీక్షించారు.
జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013లోని సెక్షన్ 40ను అనుసరించి రాష్ట్ర ఆహార భద్రత నిబంధనలు, 2017ను రూపొందించారు. జిల్లాల జాయింట్ కలెక్టర్-2 ఇక నుంచి డిస్ట్రిక్ట్ గ్రీవియన్స్ రెడ్రస్సల్ అధికారిగా వ్యవహరిస్తారు. రాష్ట్రస్థాయిలో దీనిపై త్వరలో ఒక కార్యగోష్టిని నిర్వహించనున్నారు. ఇందులో ఫుడ్ కమిషన్ భాగస్వామ్యులు, డీజీఆర్వోలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు, పాఠశాల విద్యాశాఖ అధికారులు పాల్గొంటారు. కమిషన్ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపులు జరుపుతామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ర్టంలోని రైతు బజార్లను పౌర సరఫరాల శాఖకు అనుసంధానం చేయాలన్న ప్రతిపాదనపై సమావేశంలో చర్చించారు. 10 వేల జనాభాకు ఒకటి చొప్పున మొత్తం 500 రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ కమిషనర్ రాజశేఖర్ వివరించారు. నాలుగైదు మాసాల వ్యవధిలో 300 రైతు బజార్లను ప్రారంభిస్తామని తెలిపారు.








