2019 ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి: చంద్రబాబు
2019 ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ నేతలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం విజయం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు చేరువ చేసే బాధ్యత పార్టీ నేతలదేనని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలకు కార్యకర్తలెవరూ స్పందించవద్దని, వారి సంగతి ప్రజలే చూసుకుంటారన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఉన్మాదిలా ప్రవర్తిసుంటే, అధికారంలో వస్తే ఎలా ఉంటాడో ప్రజలే బేరీజు వేసుకోవాలన్నారు. సీఎంను చెప్పుతో కొట్టాలి, నడిరోడ్డుపై కాల్చి చంపాలి, కలెక్టర్‌ను జైలుకు పంపిస్తా, పోలీస్ కమిషనర్ పింఛన్ ఆపేస్తా అంటూ వ్యాఖ్యలు చేయడం ఉన్మాదం కాక మరేమిటి అని ప్రశ్నించారు. జగన్ ఉన్మాది అనడానికి ఆయన వ్యాఖ్యలే నిదర్శమన్నారు. 2019 ఎన్నికల్లో వైకాపా 30 సీట్ల కంటే ఎక్కువ గెలిచేది లేదని సర్వేలన్నీ చెబుతున్నాయని తెలిపారు. వైకాపా నేతల వ్యాఖ్యాలే వారిని ఓడిస్తాయని, తెలుగుదేశం కార్యకర్తలంతా సంయమనం పాటించాలని సూచించారు. మంచి చేస్తే జనం మన వెంటనే ఉంటారు, చెడు చేస్తే క్షమించరని నేతలకు తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పినవి 90 శాతం పైగా మూడేళ్లలోనే చేశామని, ప్రజల్లో 80 శాతం సంతృప్తి సాధించాలని పేర్కొన్నారు. ప్రతీగ్రామంలో టీడీపీ జెండా శాశ్వతంగా ఎగరాలని తెలిపారు. గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు సమర్థ నాయకత్వం పటిష్టం కావాలని చెప్పారు.








