బహుశా చరిత్రలో ఇదే రికార్డు : చంద్రబాబు
దేశంలో ఎక్కడాలేని విధంగా ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా ఇళ్లను ఏకకాలంలో ప్రారంభించడం బహుశా చరిత్రలో ఇదే రికార్డవుతుందని, ఇది చరిత్రలో నిలిచిపోయే శుభ సంకల్పమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్థానిక ఇందిరాగాంధీ క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేదల గృహప్రవేశ మహోత్సవాలను ముఖ్యమంత్రి ప్రాంరభించారు. ఇదే వేదిక నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా 13 జిల్లాల్లో పేదల చేత ఏకకాలంలో గృహప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పేదలంతా ఒకేసారి గృహ ప్రవేశాలు చేయడం తనకెంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో 9,837 గ్రామాల్లో వేలాది మంది పేదకుటుంబాలు గృహ ప్రవేశాలు చేసి, ఆనందంతో పొంగిపోవడం, ప్రభుత్వ ప్రతిష్టను మరింత ఇనుమడింపచేసిందన్నారు.
మహాత్మాగాంధీ, లాల్బహూదూర్ శాస్త్రి జయంతి రోజున ఇంతటి శుభకార్యాన్ని నిర్వహించడం ఎంతో అనుభూతిని నిచ్చిందన్నారు. ఇది ప్రభుత్వానికి తనకు ఎంతో గర్వకారణమన్నారు. సొంతిళ్లు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని, సొంతింట్లో ఉన్న ఆనందం అద్దెంట్లో దొరకదని, అందుకే వారి కలను సాకారం చేసి, వారి ఆనందంలో ప్రభుత్వం పాలుపంచుకుంటోందని అన్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో 12 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే పేదల సొంతింటి కలను సాకారం చేసి, వారి కళ్లలో తొణికిసలాడగే సంతోషాన్ని చూడాలన్న ఏకైక లక్ష్యంతోనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలను చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు.








