వీరపనేని గూడెంలో 75 ఎంఎస్ఎంఈలకు శంకుస్థాపన.. 86 ఎకరాల్లో ఏర్పాటు
గన్నవరం సమీపంలోని వీరపనేనిగూడెంలో 86 ఎకరాల్లో రూ.260 కోట్లతో ఏర్పాటు చేయనున్న 75 ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు)లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయదశమి రోజు ఏపని చేపట్టినా జీవితాంతం విజయమేనని అన్నారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామికవాడల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రకటించారు. పారిశ్రామికవాడలకు సమీపంలోనే ఉద్యోగులకు గృహాలు ఉండాలన్న ఆలోచన చేస్తున్నామని సీఎం ప్రకటించారు. వీరపనేని గూడెం పారిశ్రామికవాడ సమీపంలో ఉద్యోగుల గృహాల కోసం 17 ఎకరాలను కేటాయిస్తున్నామని చెప్పారు.
ఇక్కడ వన్ ప్లస్ ఫోర్ లేదా వన్ ప్లస్ ఫైవ్ బహుళ అంతస్థుల భవనాలను నిర్మిచాలన్న యోచనలో ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలూ భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. వీరపనేనిగూడెం పారిశ్రామికవాడకు రైల్ ఓవర్ బ్రిడ్జి కావాలన్న పెట్టుబడిదారుల కోరికను తీరుస్తామన్నారు.








