గ్లోబల్ బిజినెస్ సదస్సుకు సీఎం చంద్రబాబు
ప్రైవేటురంగంలోని ఎస్బ్యాంకు, ఎకనమిక్టైమ్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న మూడో గ్లోబల్ బిజినెస్ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అధికారుల బృందంతో హాజరవుతున్నారు. ఈ నెల 27-28 తేదీల్లో ఢిల్లీలో మెగా బిజినెస్ సదస్సు జరుగుతోంది. ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం, ఇతర కీలక శాఖల ప్రధానకార్యదర్శులతో కలిసి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. సదస్సుకు అధికారిక రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రభుత్వపరంగా సాధిస్తున్న అభివృద్ధి, మార్పు, ప్రణాళికలపై అంతర్జాతీయ ప్రతినిధులు, వాణిజ్యవేత్తలకు ఈ సదస్సులో వివరిస్తారు. రెండురోజులపాటు జరిగే ఈ సదస్సులో 20 దేశాల నుంచి అంతర్జాతీయ ప్రతినిధులు 300 మందికిపైగా పాల్గొంటారు. గడచిన రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది నిర్వహించే సదస్సుకు భారీ స్పందన వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అంచనావేసారు. దేశంలోని ప్రముఖ రాజకీయ వేత్తలు, పారిశ్రామిక వేత్తలు, వాణిజ్యవేత్తలతో కలసి మేథోమధనం జరుగుతుందని ఆలోచనాత్మక, ఆర్థికవృద్ధికి సానుకూలించే చర్చాగోష్టులు భవిష్యత్తుకు ఎంతో ఉపకరిస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి వర్గం చెపుతోంది.













