BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి ఇంకా కొత్త ఆవిష్కరణలు రావాలి : చంద్రబాబు

బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) శక్తిమంతమైన వ్యవస్థగా మారిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. విజయవాడలో నిర్వహించిన బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవల ప్రారంభోత్సవంలో చంద్రబాబు మాట్లాడారు. ప్రపంచంలోనే భారతీయులు శక్తిమంతంగా మారారన్నారు. ప్రధాని మోదీ (Modi) దూరదృష్టితో అనేక సంస్కరణలు వచ్చాయని తెలిపారు. కొవిడ్ సమయంలో వంద దేశాలకు వ్యాక్సిన్ (Vaccine) ఇచ్చిన ఘనత మోదీది అని పేర్కొన్నారు. మనం తయారు చేసిన వస్తువులను విదేశాలు వాడే పరిస్థితి తీసుకొచ్చామని వివరించారు.అద్భుత ఆవిష్కరణలు విరివిగా వస్తున్నాయి. ఎవరూ ఆపలేరు. 2010లో 4జీ, 2020లో 5జీ వచ్చింది. 2030లో 6జీ సేవలు వస్తాయి. ప్రతి ఐదేళ్లకు ఒకసారి నూతన ఆవిష్కరణలు తోడవుతాయి. బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు మరింత విస్తృతమయ్యాయి. ప్రైవేటు కంపెనీలకు పోటీ ఇచ్చేలా మెరుగైన సేవలందించారు. దేశంలో ప్రధాని క్వాంటమ్ మిషన్ (Quantum Mission) తీసుకొచ్చారు. మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతికి జనవరిలో వస్తుంది. సేఫ్టీ, సెక్యూరిటీ కావాలంటే క్వాంటమ్ కంప్యూటర్ అవసరం. మోదీ నాయకత్వంలో ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం. బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి ఇంకా కొత్త ఆవిష్కరణలు రావాలి అని తెలిపారు.