నాడు సైబరాబాద్‌ను సృష్టించా… నేడు అమరావతి నిర్మిస్తున్నా
ఐటీ రంగంలో అగ్రగామిగా సేవలందిస్తున్న సైబరాబాద్‌ను సృష్టించింది తానేనని, ఇప్పుడు పునర్విభజన కష్టాలతో ఉన్న నవ్యాంధ్రలో అమరావతిని నిర్మిస్తోంది కూడా తానేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
మంగళగిరిలోని ఐటీ పార్కులో రూ.600 కోట్లతో నిర్మించిన అమరావతి డేటా సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వేగవంతమైన నేటి ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానంతో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని, భవిష్యత్తులో టెక్నాలజీ ప్రతి రంగంలో కీలకపాత్ర పోషిస్తుందని సృష్టం చేశారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీని అనుసంధానించడం ద్వారా పారదర్శకమైన పాలనను ప్రజలకు అందించ గలుగుతున్నామని తెలిపారు. 1995లో ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిందని, దీనితో భవిష్యత్తులో ఐటీ రంగానికిదే కీలకపాత్ర ఉంటుందని ఊహించి మైక్రోసాఫ్ట్ దిగ్గజం బిల్‌గేట్స్‌ను కలిసి పెట్టుబడులకు హైదరాబాద్‌కు ఆహ్వానించటం జరిగిందన్నారు. దీనితో ఆయన మైక్రోసాఫ్ట్ కంపెనీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారని, ఆ కంపెనీలో ఉద్యోగిగా చేరిన సత్యనాదెండ్ల నేడు ఆ కంపెనీకే సీఈఓగా ఉన్నారంటే అది తెలుగోడి గొప్పతనమన్నారు.
పచ్చని పంట పొలాల మధ్య నిర్మితమవుతున్న అమరావతిని ప్రపంచంలోనే సుందరమైన నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రభుత్వశాఖల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, తొలిసారిగా రిజిస్ట్రేషన్ శాఖను పూర్తిగా కంప్యూటరీకరించామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో, స్కూళ్లు, కళశాలలు, వసతి గృహాల్లో బయోమెట్రీక్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ -ప్రగతి, ఈ-ఆఫీస్, రియల్‌టైం గవర్నెన్స్ అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయని, టెక్నాలజీ రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులతో ఎలక్ట్రికల్ వాహనలు, డ్రైవర్‌లేని వాహనాలు కూడా అతి త్వరలో అందుబాటులోకి రానున్నాయన్నారు. నవ్యాంధ్రలో మానవ వనరులకు కొదవలేదని, ఐటీ రంగంలో వస్తున్న అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఎవరు ముందుకు వచ్చినా రాయితీలు ఇవ్వటంతోపాటు అవసరమైన మౌలికసదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు.








