ప్రపంచంలోనే అత్యంత ఆనంద నగరాల్లో అమరావతి : చంద్రబాబు
జీవనది కృష్ణమ్మ చెంత నిర్మితమవుతున్న అమరావతి నగరం ప్రపంచంలోనే అత్యంత ఆనంద నగరాల్లో ఒకటిగా ఉంటుందని, ఇక్కడ నివసించేందుకు ప్రజలు అత్యంత ఆసక్తిని చూపేలా తయారు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పీటీఐ వార్త సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన చంద్రబాబు, హ్యాపీనెస్ ఇండెక్స్‌లో అమరావతి టాప్ స్థానంలో ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నగర నిర్మాణానికి అమరావతి ప్రాంత రైతులు స్వచ్ఛందంగా 32,500 ఎకరాల భూమిని వినూత్నమైన ల్యాండ్ పూలింగ్ విధానంలో అందించారని గుర్తు చేసిన చంద్రబాబు తనపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇదే నిదర్శనమని తెలిపారు. కష్టాలనే అవకాశాలుగా మలచుకుంటూ, నూతన రాజధాని నిర్మాణం నిమిత్తం తాను అడుగులు వేస్తున్నానని, ఓ స్వచ్ఛమైన హరిత నగరంగా అమరావతిని తయారు చేస్తామని తెలిపారు. నగరం మొత్తం నీటి లభ్యత ఉంటుందని, తటాకాలు, పార్కులతో ఉష్ణ్రోగతలు పెరగకుండా నియంత్రణలో ఉంచే విధానాన్ని అవలంబిస్తామని తెలిపారు. కృష్ణా నదిలో పదమూడు ఐలాండ్లు ఉన్నాయని, వాటిల్లో ఏడింటిని పర్యాటక ప్రదేశాలుగా మార్చాలని నిర్ణయించామని తెలిపారు. వెలగపూడిలో తాత్కాలిక ప్రభుత్వ కాంప్లెక్స్‌ను 192 రోజుల వ్యవధిలో పూర్తి చేశామని, ఇక్కడ ఇప్పుడు 500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు.








